బంగారం ధరలు గడచిన వారం రోజులుగా మనం గమనించినట్లయితే ఏకంగా గరిష్ట స్థాయి నుంచి రూ. 3500 వరకు పతనమైనట్టు గమనించవచ్చు. దీంతో పసిడి ప్రియుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
బంగారం ధర రూ. 55 వేల దిగువకు చేరింది దీంతో బంగారు నగలు కొనేవారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎందుకంటే పసిడి ధరలు గరిష్ట స్థాయి నుంచి వరుసగా ఫిబ్రవరి నెలలో దిగుతూ వస్తున్నాయి. అటు బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది.
గత శుక్రవారం బెంచ్‌మార్క్ గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో రూ. 55,587 వద్ద ముగిసింది. గత వారం రూ.55,759 వద్ద గరిష్ట స్థాయిని తాకడం విశేషం. ఈ నెల, MCXలో బెంచ్‌మార్క్ గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ 10 గ్రాములకు రూ.58,847 వద్ద ఆల్ టైమ్ హైని తాకింది. అక్కడి నుంచి పతనమవుతూ వస్తున్నాయి.
మరోవైపు MCXలో వెండి బెంచ్‌మార్క్ మార్చి కాంట్రాక్ట్ గత శుక్రవారం రూ. 64,389 వద్ద ప్రారంభమై, కిలోకు రూ. 64,351 వద్ద ముగిసింది. వెండి ధర రూ. 51 తగ్గి, కిలో రూ. 64,300 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల, వెండి ధరలు 11 నెలల గరిష్ఠ స్థాయి కిలో రూ.72,000కి చేరి అక్కడి నుంచి షార్ప్ గా పడిపోయాయి.
అటు రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి ముఖ్యంగా బంగారం ధరలు ప్రస్తుతం 55000 దిగువన ట్రేడవడం విశేషం. ఈ నెలలోనే బంగారం ధర రిటైల్ మార్కెట్లో 58000 వరకు పెరిగింది. అయితే అక్కడి నుంచి ఒక్కసారిగా బంగారం ధరల్లో ఒక షార్ప్ ఫాల్ కనిపించింది. ఫలితంగా పసిడి ధరలు ఏకంగా గరిష్ట స్థాయి నుంచి 3500 వరకు పతనమై, ప్రస్తుతం 55000 సమీపంలో ట్రేడవటం విశేషం. అయితే పసిడి ధరలు అంతర్జాతీయంగా గమనించినట్లయితే కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి.
ముఖ్యంగా అమెరికా మార్కెట్లో చూసినట్లయితే, బంగారం ఒక ఔన్స్ అంటే 31 గ్రాముల ధర సుమారు 1800 డాలర్ల దిగువన ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు రిటైల్ మార్కెట్లో కూడా భారీగా పతనం అవుతూ వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు, డాలర్ ధర మార్కెట్లో రోజురోజుకీ బలం పుంజుకోవటంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మదుపుదారులు బంగారం ఫ్యూచర్స్ మార్కెట్లో పెట్టుబడులను ఉపసంహరించుకొని, అధిక లాభాలు ఇచ్చే యూఎస్ బాండ్స్ కొనుగోలు చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
