న్యూఢిల్లీ: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఊగిసలాట మధ్య కొనసాగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల నుంచి వెనక్కి తీసుకోవడం, రూపాయి విలువ కోలుకోవడంతో ధరలు పతనం అయ్యాయి.

దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర శుక్రవారం ఒక్క రోజే రూ.1,097 తగ్గి రూ.42,600 స్థాయికి పడిపోయింది. గురువారం ఈ ధర రూ.43,697గా నమోదైంది.

 

also read పునర్నిర్మాణ పథకం, త్వరలోనే యెస్ బ్యాంక్ పై ఆంక్షలు ఎత్తివేత...

వెండి ధర కూడా భారీగా పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి రూ.1,574 దిగి వచ్చి రూ.44,130 వద్ద ముగిసింది. గత ముగింపు రూ.45,704గా ఉన్నది. హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.43,300లకు, కిలో వెండి రూ.43,931లకు పడిపోయింది. 

స్టాక్‌ మార్కెట్లు, రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి రిజర్వు బ్యాంక్‌ రంగంలోకి దిగడంతో తిరిగి కోలుకోవడం బులియన్‌ ధరలు దిగిరావడానికి ఇదే ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. 

డాలర్‌తో రూపాయి విలువ 23 పైసలు కోలుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,584 డాలర్లకు, వెండి 15.65 డాలర్లకు పడిపోవడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయని హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు తెలిపాయి.. 

ఈ నెల ప్రారంభంలో గరిష్ఠ స్థాయి రూ.45 వేల మార్క్‌ను దాటిన బంగారం ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. కరోనా వైరస్‌ కల్లోలం దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు, మరోవైపు రూపాయి బక్కచిక్కుతున్న ప్రస్తుత సమయంలో పసిడి ధరలు కూడా తగ్గుముఖం పట్టడం గమనార్హం.

also read ఆనంద్ మహీంద్రాకు కరోనా వైరస్ స్పెషల్ గిఫ్ట్...

గత రెండు రోజుల్లోనే  బంగారం ధర ఏకంగా రూ.2000కు పైగా పడిపోయింది. వెండి కూడా రూ.2,600కి పైగా జారుకున్నది.  ఇప్పటి వరకు ఈక్విటీల కంటే బంగారం సురక్షితమైన భావించిన పెట్టుబడిదారులు వీటిపైన పెట్టుబడులు పెట్టడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

రోజు రోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో గ్లోబల్‌ మార్కెట్లో 2011 తర్వాత ఒక్క వారంలో ఇంతటి భారీ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. మొత్తంమీద ఈవారంలో స్పాట్‌ గోల్డ్‌ 1.3 శాతం తగ్గి 1,555.42 డాలర్లకు, గత సెషన్‌లోనూ 3.6 శాతం తగ్గింది. సోమవారం ఏడేళ్ల గరిష్ఠ స్థాయి 1,700 డాలర్లు పలికిన ధర ప్రస్తుతం ఏడు శాతం తగ్గింది.