Asianet News TeluguAsianet News Telugu

మాంద్యం వల్ల అందరి చూపులూ పుత్తడివైపే.. తులం గోల్డ్@ రూ.38,960


పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం ముంచుకొస్తుండటంతో పెట్టుబడిదారులంతా పుత్తడి వైపే చూస్తున్నారు.

Gold prices today hold steady, silver rates remain soft
Author
New Delhi, First Published Aug 22, 2019, 3:55 PM IST

న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో పసిడి పరుగు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న అతి విలువైన లోహాలు గురువారం మరో శిఖరాగ్రానికి చేరుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.38,960లకు చేరుకున్నది. 

బుధవారం ఆభరణాల వర్తకుల నుంచి వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర మరో రూ.50 అందుకొని రూ.38,820కి చేరుకున్నది. త్వరలో రూ.39 వేల మార్క్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బులియన్ వర్తకులు చెప్పారు. వెండి ఏకంగా రూ.1,140 ఎగబాకి రూ.45,040 వద్ద ముగిసింది. 

పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులు కొనుగోళ్లకు మద్దతు చూపడంతో భారీగా పడిపోయిన మరునాడే వెండి ధర పెరుగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టినా దేశీయంగా పెరుగడం విశేషం. 

మరోవైపు ఈక్విటీ మార్కెట్లు తగ్గుముఖం పట్టడం కూడా పసిడి ధరలు పెరుగడానికి పరోక్షంగా దోహదం చేసినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,499.20 డాలర్లకు చేరుకోగా, వెండి 17.08 డాలర్లు పలికింది.

మరోవైపు ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ లెక్కల ప్రకారం భారతీయుల వద్ద 25 వేల టన్నుల బంగారం ఉన్నట్లు తేలింది. అమెరికా  వద్ద 8,133 టన్నులు, జర్మనీ వద్ద 3,373, ఐఎంఎఫ్‌ వద్ద 2,814, ఇటలీ వద్ద 2,450, ఫ్రాన్స్‌ వద్ద 2,435, చైనా వద్ద 1,842, రష్యా వద్ద 1,778 టన్నుల బంగారం ఉంది. వీటితో పోలిస్తే భారతీయుల వద్ద ఉన్న పసిడి చాలా ఎక్కువ.

గత ఏడాది  వరకు 24వేల టన్నులు ఉన్న నిల్వలు ఈ ఏడాది 25వేల టన్నులకు చేరినట్లు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) భారత్ ఎండీ శామ్‌ సుందర్‌ వెల్లడించారు. ఇది దేశ జీడీపీలో 40శాతం మొత్తానికి సమానం. 2019లో అత్యధికంగా భారతీయులు 850 టన్నుల బంగారం కొనుగోలు చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీనికి ఆర్థిక మాంద్యం తోడైతే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

జనవరి నుంచి మార్చిలోపే 159టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. 2010లో అత్యధికంగా 963 టన్నుల పుత్తడి భారతీయుల ఇళ్లల్లో చేరింది. 2016లో నోట్ల రద్దు వేళ కొనుగోళ్లకు కొంత బ్రేక్ పడి 666 టన్నులకే పరిమితమైంది. ఇప్పటి వరకు 1,90,040 టన్నుల బంగారాన్ని భూగర్భం నుంచి వెలికి తీసినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిల్లో 1950 తర్వాత 1.26లక్షల టన్నులను బయటకు తీశారు. 

దేశంలో బంగారు నగల కొనుగోళ్లలో కేరళ తొలి స్థానంలో, గోవా రెండో స్థానంలో ఉంది.  గోవా కంటే కేరళ కొనుగోళ్లు ఆరురెట్లు అధికం కావడం గమనార్హం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల వారు నగలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సిక్కింలో అత్యల్పంగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కేరళలో బంగారు గనులు లేకున్నా బంగారం అధికంగా ఉండటానికి కారణం సుగంధద్రవ్యాల వ్యాపారం. 

బంగారంపై భారతీయులు మోజు పెంచుకోవడానికి చారిత్రక, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. మన సంస్కృతిలో బంగారాన్ని సంపదకు, హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం ధరించడానికి ఆసక్తి కనబరుస్తారు.  వివాహ వేళ్లలో బంగారం నగలు కొనడం భారత్‌లో పరిపాటి. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్‌ ఆకాశాన్నంటుతుంది. 

వివిధ పండుగలకు, పర్వదినాలకు బంగారం కొనుగోలు ఒక శుభసూచకంగా భావిస్తారు. థంతేరాస్‌, అక్షయతృతీయ వంటి పండుగలకు బంగారం కచ్చితంగా కొనుగోలు చేయాలని భావిస్తారు. భారత్‌లో బంగారం నగదుతో సమానంగా చలామణి అవుతుంది. కష్టకాలంలో బంగారం విక్రయించుకుంటే తక్షణమే నగదు చేతికొస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. 

నల్లధనం నిల్వకు బంగారం అనువైన మార్గంగా భావిస్తారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో బంగారం నిల్వ చేస్తారు. దీనిని అవసరమైనప్పుడు మార్కెట్లో విక్రయించి నగదుగా మార్చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉండే భారత్‌లో పెట్టుబడి మార్కెట్లపై పెద్దగా అవగాహన లేకపోవడం.. బంగారం ధర నిలకడగా పెరుగుతుండటంతో సరక్షితమైన పెట్టుబడి మార్గంగా మారింది. 

తమ తర్వాతి తరాలకు సంపదను పంచడానికి భారతీయులు ఎంచుకునే మార్గాల్లో భూములు, బంగారం ప్రధానమైనవి. దీంతో చాలా వరకు సొమ్ము బంగారం రూపంలో భద్రం చేస్తారు. బంగారు నగలను వారసత్వ సంపదగా భావించే కుటుంబాలకు భారత్‌లో కొదవేలేదు. 

బంగారాన్ని మృత ఆస్తిగా, అత్యవసర నిధిగా మాత్రమే ఆర్థిక వేత్తలు భావిస్తారు. బంగారం ధర ఆధారంగా దాని విలువలో మార్పులు ఉంటాయి. బంగారం నుంచి కొత్తగా ఉత్పాదకత ఏమీ ఉండదు. ముడి చమురును 114 బిలియన్‌ డాలర్లకు పైగా వెచ్చించి దిగుమతి చేసుకోగా.. బంగారం కోసం 30 బిలియన్‌ డాలర్ల వరకు విదేశీ మారకద్రవ్యం హరించుకుపోయింది. ఈ మేరకు విదేశీ మారకద్రవ్యం సంపాదించడానికి కొత్త మార్గాలేవీ అందుబాటులోకి రావడంలేదు. 

పెట్టుబడి రూపంలో ఉపయోగపడాల్సిన అమూల్యమైన నగదు బంగారం రూపంలో ఇనుప బీరువాల్లో కొన్నేళ్లపాటు మూలుగుతుంటే మార్కెట్లు మాత్రం పెట్టుబడుల కొరతతో అల్లాడిపోతున్నాయి. బంగారం కొనుగోళ్లను తగ్గిస్తే ఆ నిధులను పెట్టుబడుల్లోకి మళ్లించే అవకాశం ఉంది. 

మరోపక్క బంగారాన్ని పన్ను ఎగవేతకు బలమైన మార్గంగా ఎంచుకొంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పడిపోతోంది. చైనా వంటి దేశాలు ఈశాన్య భారతం నుంచి భారత్‌లోకి అక్రమంగా బంగారాన్ని పంపిస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విక్రయించే అక్రమ బంగారం చాలా వరకు ఈశాన్య భారతం నుంచి వచ్చేదే కావడం గమనార్హం.     

కేంద్ర ప్రభుత్వం దేశప్రజలను బంగారం మోజు నుంచి మళ్లించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే బంగారం దిగుమతిపై 12.5శాతం పన్ను విధిస్తోంది. కానీ దిగుమతుల్లో పెద్దగా మార్పులేదు. దీనికి తోడు అక్రమ బంగారం రవాణ పెరుగుతోంది. 

ప్రభుత్వం బంగారం ఎగుమతులను పెంచేందుకు 80:20 నిబంధన తీసుకొచ్చారు. దీనికింద దిగుమతి చేసుకొనే బంగారంలో 80శాతం దేశీయంగా విక్రయించి.. 20 శాతం ఎగుమతి చేయాల్సి ఉన్నా ఆ తర్వాత ఈ నిబంధనను తొలగించారు. పరిమితిని మించిన బంగారం కొనుగోళ్లకు పాన్‌ నెంబర్‌ తప్పనిసరి చేశారు. 

వజ్రాలు, నగల పరిశ్రమను హవాలా లావాదేవీల నిరోధక చట్టం పరిధిలోకి చేర్చారు.  వినియోగంలో లేని బంగారాన్ని నగదుగా మార్చేందుకు గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో వడ్డీరేట్లను 0.5%-2.5%గా నిర్ణయించింది. దీనిపై క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ను మినహాయించింది. మరికొన్ని పన్ను మినహాయింపులు ఇచ్చింది. 

ఇలా వచ్చిన బంగారంతో అదనపు దిగుమతులకు కళ్లెం వేయవచ్చని భావించింది. ఏప్రిల్‌ 2019నాటికి అందుబాటులో ఉన్న మొత్తం 12 గోల్డ్‌ ఈటీఎఫ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టిన వారి సంఖ్య కేవలం 3.19 లక్షల మంది మాత్రమే. ఈ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మరోపక్క ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుండటంతో మళ్లీ అందరి చూపులు పుత్తడి పైనే ఉన్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios