న్యూఢిల్లీ: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పుత్తడి ధర శుక్రవారం మార్కెట్లో రూ.800 తగ్గి రికార్డు స్థాయి ధర రూ.40 వేల దిగువకు చేరుకున్నది. ఢిల్లీలో రూ.39,420వద్దకు చేరుకోగా, హైదరాబాద్ మార్కెట్లో రూ.39,865 వద్ద స్థిరపడింది. మరోవైపు కిలో వెండి ధర రూ.1200 తగ్గింది. 

పుత్తడితోపాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గినా ప్రీసియస్ లోహాల ధరలు గరిష్ట స్థాయిలోనే సాగుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో 0.20 శాతం తగ్గి పది గ్రాముల బంగారం ధర రూ.38,734కు చేరింది. అంతర్గతంగా ట్రేడింగ్‌లో రూ.38,650-38,756 మధ్య తచ్చాడింది. గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.39,425గా పలికింది. 

గురువారం బులియన్ మార్కెట్‌లో పుత్తడి ధర ఏకంగా రూ. 40వేల మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గురువారం ఒక్కరోజే రూ. 250 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ. 40,220 పలికింది. అటు వెండి ధర కూడా రూ. 50వేల మార్క్‌ను సమీపిస్తోంది. నేడు రూ. 200 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 49,050కి చేరింది. 

ఆర్థిక మాంద్యం భయాలు, అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య అనిశ్చితులు, రూపాయి క్షీణత తదితర కారణాలతో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. దీనికితోడు పండగ సీజన్‌ కావడంతో నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ లోహాల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.