బంగారం ధరలు ఎన్నడూ లేని గరిష్ఠస్థాయిలకు చేరుతున్నాయి. బుధవారం రాత్రి 10 గంటల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోని బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం రూ.38,900- 39,000ను తాకింది. 

అంతర్జాతీయ విపణిలో ఒక్కరోజులోనే ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 35 డాలర్ల మేర పెరిగి 1507 డాలర్లకు చేరడం వల్లే, దేశీయంగా భారీ పెరుగుదల నమోదవుతోందని విక్రేతలు చెబుతున్నారు. 

వెండి కూడా ఇదేబాటన కిలో రూ.45 వేలకు చేరింది. ట్రేడింగ్‌లో గిరాకీని బట్టి కూడా ఈ ధరలు మారుతుంటాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్యయుద్ధం తారాస్థాయికి చేరుతుండటంతో స్టాక్‌మార్కెట్లు నష్టపోతున్నాయి. 

ఈ నేపథ్యంలో, రక్షణాత్మకంగా ఉంటుందనే భావనతో మదుపుదార్లు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లిస్తున్నారు. ఫలితమే ఈ పెరుగుదల. ఢిల్లీలో బుధవారం ఉదయం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1113 పెరిగి రూ.37,920కి చేరింది. వెండి కూడా కిలో రూ.650 అధికమై రూ.43,670కి చేరింది. ఆభరణాల (916 స్వచ్ఛత) బంగారం సెవరు (8 గ్రాములు) రూ.27,800కు చేరింది.

వినియోగదారులు బంగారం ధర పెరిగిపోతోందని హడావుడి పడిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ విపణికి తోడు డాలర్‌ మారకపు విలువ పెరిగినా కూడా దేశీయంగా ధర పెరుగుతోంది. కస్టమ్స్‌ సుంకం 12.5% అదనంగా కలుస్తుండటంతో, విదేశాలతో పోలిస్తే, దేశీయంగా ధర మరింత అధికంగా కనపడుతోంది. అందువల్ల అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ల తయారీదారుల నుం చి వెండికి గిరాకీ పెరుగుతోంది. బుధ వారం ఎంసీఎక్స్‌ ఫ్యూచర్‌ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర నూతన గరిష్ఠ స్థాయిలో రూ.37,848 స్థాయికి చేరింది. ధరలు ఇదే స్థాయిలో పెరిగితే కొన్ని రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.40,000 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధంపై ఆందోళన నేపథ్యంలోనే  స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్లకన్నా బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఎగబాకుతోంది. 

ప్రపంచ స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1,490 డాలర్ల స్థాయిలో, ఔన్స్‌ వెండి ధర 16.81 డాలర్ల స్థాయిలో ఉన్నాయి.కామెక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 1,500 డాలర్లు దాటింది. ఇది ఆరేళ్ల గరిష్ఠ స్థాయి ధర కావడం గమనార్హం. కామెక్స్‌లో ఈ ఏడాదిలో బంగారం ధరలు 17 శాతం పెరిగాయి.

దీనికి దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు తోడవుతున్నాయి. బంగారం దిగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి.పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీని ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతోంది. బంగారం ధరలు బాగా పెరుగుతున్న కారణంగా చాలా మంది పాత బంగారాన్ని విక్రయిస్తున్నారని జువెలర్లు చెబుతున్నారు. ఇది బంగారం దిగుమతులు తగ్గడానికి కారణమవుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు.