బంగారం ధర రోజు రోజుకీ పైపైకి పోతోంది. ఆరేళ్ల గరిష్ట స్థాయికి బంగారం ధర చేరుకుంది. కాగా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశీయ బులియన్ విపణిలో సోమవారం రాత్రి 11గంటల సమయానికి పదిగ్రాముల మేలిమి బంగారం ధర రూ.37వేలు ఉంది. 

ఈ ధర ఆధారంగానే ఆభరణాల కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనాలంటేనే సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు.  దేశీయంగా విక్రయించే బంగారం అంతా దిగుమతి చేసుకుని విక్రయించేదే. అందువల్ల అంతర్జాతీయ విపణి ఆధారంగా, ధరలు మారుతుంటాయి. డాలర్‌-రూపాయి మారకపు విలువలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్నాయి. 

బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. 

గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1,474 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం పెరుగుదలతో 16.43 డాలర్లకు చేరింది. 

ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరుగుదలతో రూ.36,540కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.35,350కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది.