బంగారం ధర మళ్లీ ₹1 లక్ష దాటింది. డాలర్ విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితి కారణంతోనే  ధరలు పెరిగినట్లు తెలుస్తున్నాయి.

దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం నాడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ₹1 లక్షను మళ్లీ దాటి వినియోగదారులకు భారంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో బంగారం ఔన్సు ధర ఒక్కరోజులోనే దాదాపు 98 డాలర్లు పెరిగి 3412 డాలర్లను తాకింది. దీనికి ప్రధాన కారణాలుగా అమెరికా డాలర్ విలువ తగ్గిపోవడం, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితులు చూపిస్తున్నాయి.

ఇటీవల కొన్ని వారాలుగా బంగారం ధరలు పెరుగుతూ, కాసేపు తగ్గి, మళ్లీ పెరిగే ధోరణిలో ఉన్నాయి. గత నెలలో కూడా ఔన్సు బంగారం ధర 3407 డాలర్ల వరకు వెళ్లడంతో దేశీయంగా ₹1 లక్ష మార్కును దాటింది. ఆ తర్వాత కొంతవరకు తగ్గినా, తాజాగా మళ్లీ అదే స్థాయికి చేరుకుంది.

అమెరికా డాలర్ విలువ బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలలో ఒకటి. ప్రపంచ వాణిజ్యం ప్రధానంగా డాలర్లలో జరిగే నేపథ్యంలో, డాలర్ స్థిరంగా లేకపోతే పెట్టుబడిదారులు భద్రమైన ఎంపికగా బంగారం వైపు మొగ్గుచూపుతారు. దీర్ఘకాలంలో బంగారం లాభాలను ఇస్తుందని నమ్మకం ఉండడంతో, డాలర్ పడినప్పుడు బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఫలితంగా ధరలు కూడా ఎగుస్తాయి.

1944లో కుదిరిన బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ద్వారా డాలర్ అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా మారింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు తమ కరెన్సీ విలువను డాలర్‌తో పోల్చుకుని వాణిజ్యం చేస్తుంటాయి. ఐఎంఎఫ్ వంటి సంస్థలు కూడా దేశాలకు బంగారం కోసం డాలర్లు మారుస్తూ, దీనిని ప్రోత్సహించాయి. దీని వలన డాలర్ విలువపై బంగారం ధర ఎక్కువగా ఆధారపడుతుంది.కేవలం డాలర్ విలువ మాత్రమే కాక, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డిమాండ్, సరఫరా, పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాలు కూడా బంగారం రేటును ప్రభావితం చేస్తుంటాయి. అమెరికాలో నిరుద్యోగం పెరగడం వంటి ఆర్థిక సంకేతాలు డాలర్‌ను దెబ్బతీస్తే, ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరిగిపోతాయి.

ఇక, డాలర్ పడిపోతే ఇతర కరెన్సీలతో పోల్చితే బంగారం తక్కువ ధరకు లభిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కొనుగోళ్లకు దారితీస్తుంది. ఆ డిమాండ్ ప్రభావంతోనే ధరలు మరింత పెరుగుతాయి. అందుకే, మళ్లీ ₹1 లక్ష మార్క్‌ను బంగారం తాకిన ఈ పరిస్థితిని పరిశీలిస్తే, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు బంగారం విలువపై ఎంత గాఢంగా ప్రభావం చూపుతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది.