రోజురోజుకి బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేటు 88 వేలకు చేరే అవకాశాలు కనపడుతున్నాయి.

బంగారం రేటు ఒక సమయంలో ఆకాశాన్ని తాకినట్టు వెళ్లిపోయింది. పదిరోజుల క్రితం వరకు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర లక్ష రూపాయలు దాటింది. దీని వల్ల సామాన్య ప్రజలు బంగారం కొనాలంటే కూడా వెనుకంజ వేస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా పరిస్థితి మారిపోతోంది. ప్రస్తుతం బంగారం ధర కాస్త తగ్గి 93,000 రూపాయల వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ కూడా తగ్గుదలతో ట్రేడవుతోంది. ఔన్స్‌కు గోల్డ్ ధర 1.8 శాతం తగ్గి సుమారు 3,255 డాలర్ల వరకు వచ్చింది. మార్కెట్ నిపుణుల మాట ప్రకారం, రాబోయే మూడునెలల్లో గోల్డ్ రేటు మరింతగా తగ్గే అవకాశం ఉంది. వచ్చే రోజుల్లో ఇది 88,000 రూపాయల దిగువకు వచ్చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

గతేడాది ఇదే ఏప్రిల్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 75,000 రూపాయలదాకా ఉండేది. దాని తర్వాత మార్కెట్ పరిస్థితులు మారుతూ వచ్చాయి. 2025 ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నో దేశాలపై సుంకాలు పెరిగాయి. ముఖ్యంగా చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకాయి.

ఇప్పుడు ఆ ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెట్టడంలో వెనక్కి తగ్గుతున్నారు. దీని ప్రభావంగా గోల్డ్ రేటు క్రమంగా దిగుతుందనే అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఔన్స్ ధర 3,000 లేదా 2,950 డాలర్ల వరకు పడిపోతే, దేశీయంగా 10 గ్రాముల గోల్డ్ ధర 88,000 రూపాయల కంటే తక్కువకు చేరవచ్చని అనుకుంటున్నారు నిపుణులు.