పసిడి ధర ఇప్పటికే భగ్గుమంటున్నది. మున్ముందు మరింత పెరగవచ్చని బులియన్ మార్కెట్ విశ్లేకులంటున్నారు. దీపావళి నాటికి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40వేల స్థాయిని దాటిపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ వృద్ధిపై ఆర్థిక మాంద్యం సంకేతాలతోపాటు అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలతో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో పసిడి పరుగులు తీస్తున్నాయి. దాంతో భారత్‌లోనూ ధరలు కొండెక్కుతున్నాయి. 

‘ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో కొద్ది రోజులపాటు బంగారం ధరలు కాస్త తగ్గినప్పటికీ.. మొత్తంగా ట్రెండ్‌ చూస్తే మాత్రం ప్రతికూలంగానే ఉంది.

దీపావళి నాటికి పసిడి రేటు రూ.39,000-40,000కు చేరుకోవచ్చు’ అని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ప్రతినిధి అనూజ్‌ గుప్తా అన్నారు. అంతర్జాతీయ వృద్ధి క్షీణత భయాలే బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 

ఆర్థిక, రాజకీయపరమైన అనిశ్చతి పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి బంగారంలోకి మళ్లిస్తున్నారు. ఈ ఏడాదిలో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌(ఈటీఎఫ్)లలోకి పెట్టుబడులు గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. 

ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొన్న వివరాల ప్రకారం.. జూలైలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి 260 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. దాంతో మొత్తం పెట్టుబడులు 2,600 టన్నులకు చేరుకున్నాయి. 2013 మార్చి తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి.

ప్రస్తుతం న్యూయార్క్‌ కమోడిటీ మార్కెట్లో ఔన్సు (31.5 గ్రాములు) బంగారం 1,500 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది. శుక్రవారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల రేటు 10 గ్రాములకు రూ.38,420 పలికింది. ముంబైలో రూ.37,640గా నమోదైంది.

యూరప్ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల జర్మనీలో ప్రతికూల ప్రగతి నమోదైంది. తద్వారా మాంద్యం అంచున జర్మనీ నిలిచింది. మరోవైపు ఈయూ నుంచి వైదొలిగేందుకు బ్రిటన్.. కూటమితో బ్రెగ్జిట్ ఒప్పందంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 

చైనా దిగుమతులపై మరో దఫా అమెరికా 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తే రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ మరింత ముదురుతుందని ఇన్వెస్ట్ మెంట్ ఫర్మ్ మోర్గాన్ స్టాన్‌లీ హెచ్చరించింది. అమెరికా దిగుమతి సుంకాలు విధించిన మూడు వారాల్లోనే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున నిలబడుతుందని స్పష్టం చేసింది.