మరోసారి పసిడి బాండ్లను జారీ చేసింది రిజర్వు బ్యాంక్. ఈ నెల 9న ప్రారంభం కానున్న ఈ పసిడి బాండ్ గ్రాము ధరను రూ.3,890గా నిర్ణయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం ఈ నెల తొమ్మిదో తేదీన ప్రారంభమై 13వ తేదీన ముగియనున్నదని తెలిపింది.

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ఆన్‌లైన్ దరఖాస్తు, చెల్లింపులు జరిపేవారికి ప్రతి గ్రాముపై రూ.50 రాయితీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి పెట్టుబడిదారులకు గోల్డ్ బాండ్ రూ.3,840కి లభించనున్నదని పేర్కొంది. 
భారత్‌లో పసిడి వినిమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్ నవంబర్ 2015లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏడాదిపాటు కనీసంగా ఒక్క గ్రాము, గరిష్ఠంగా 500 గ్రాముల వరకు కొనుగోలు చేయవచ్చు.

మరోవైపు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, రూపాయి మరింత బలపడటంతో అతి విలువైన లోహాల ధరల దూకుడుకు బ్రేక్‌పడింది. హైదరాబాద్ నగరంలో శనివారం పది గ్రాముల పసిడి ధర స్వల్పంగా పెరిగి రూ.39,670కి చేరుకుంది.

అంతకుముందు శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.372 తగ్గి రూ.39,278కి పరిమితమైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. బంగారంతోపాటు వెండి ఏకంగా రూ.1,273 తగ్గి రూ. 49,187కి పడిపోయింది. 

పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవడంతో కిలో వెండి ధర రూ.50 వేల దిగువకు పడిపోయిందని బులియన్ ట్రేడర్ ఒకరు చెప్పారు. గరిష్ఠ స్థాయికి చేరుకున్న బంగారాన్ని కొనుగోలు చేయడానికి స్థానికులు, వర్తకుల్లో అనాసక్తి, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 21 పైసలు లాభపడటం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,510 డాలర్లకు పడిపోగా, వెండి 18.30 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు నివేదిక విడుదల కావడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను అతి విలువైన లోహాల నుంచి ఇతర వైపు మళ్లించడంతో ధరలు దిగొస్తున్నాయని పటేల్ వెల్లడించారు.