విమానయాన సంస్థలన్నీ తమ ప్రయాణికులను ఆఫర్లతో తెగ ఊరించేస్తున్నాయి. దేశీయంగా రూ.799-899 నుంచి టికెట్లు కొనుగోలు చేసే వారికి జాతీయ మార్గాల్లో ఆపర్లు ఇస్తున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. దేశీయ మార్గాలతోపాటు విదేశీ మార్గాల్లోనూ భారీ ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొంటున్నాయి. 

సంస్థ వెబ్‌సైట్‌/మొబైల్‌ యాప్లలోకి వెళ్లి పరిశీలిస్తే, ప్రారంభస్థాయి ఆఫర్‌ ధరలో టికెట్లు లభించకున్నా, మొత్తమ్మీద అందుబాటు ధరల్లోనూ టికెట్లు లభిస్తున్నాయి. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు పెరుగుతున్నాయి.

మరోవైపు ప్రయాణికుల సేవా రుసుము పెంచాలని సంబంధిత అంశంపై నియమించిన కమిటీ సూచించిన నేపథ్యంలో, భవిష్యత్‌లో విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశాలే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ముందస్తుగా ప్రణాళిక వేసుకుని, ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే, విమాన ప్రయాణం జేబుకు భారంగా మారకుండా ఉంటుంది.

విమాన టికెట్ల ధరలు శీతాకాలం, వేసవి సెలవుల్లో అధికంగా ఉంటాయి. అయితే గత అక్టోబర్-జనవరి సీజన్‌లో మాత్రం టికెట్ల ధరలు మరీ అధికంగా పెరగలేదనే చెప్పాలి. ప్రయాణ తేదీ, ఆ ముందు రోజు కొనుగోలు చేసే, ఆఖరి నిమిషపు టికెట్లు అధికంగా పలికినా, వారం పది రోజుల ముందు కొనుగోలు చేసిన వారికి కూడా ఎక్కువ భారం పడలేదనే పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడు విద్యార్థులకు పరీక్షల సీజన్‌ కావడంతో రద్దీ తక్కువే ఉంటుంది. ఏప్రిల్‌ మధ్యకొచ్చేసరికి దాదాపు పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థుల పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి, మళ్లీ ప్రయాణాల హడావుడి అధికమవుతుంది. ఈ సమయంలో ఏసీ బస్సులు, రైళ్లలో ఏసీ కోచ్‌లలో టికెట్ల ధరలూ మండుతుంటాయి. 

పైగా వందలు, వేల కిలోమీటర్ల దూరంలోని వేసవి విడిదులకు, సన్నిహితుల దగ్గరకు వెళ్లేందుకు..ఇప్పుడు ఆఫర్లలో వస్తున్న విమాన టికెట్లు కొనుగోలు చేసుకుంటే, భారం లేకుండా ఉంటుంది. ఆయా సంస్థల ఆఫర్లను పరిశీలిద్దాం..

ట్రూజెట్‌ ద్వారా ఈ నెల 8 నుంచి 17 వరకు ఆఫర్‌ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. బేసిక్‌ ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. దీనికి పన్నులు అదనం. 

వచ్చే అక్టోబరు 26 వరకు ప్రయాణించేందుకు రాయితీ టికెట్లు వినియోగించుకోవచ్చని ట్రూజెట్ తెలిపింది. వేసవి సెలవులతో పాటు దసరా సీజన్‌కు కూడా వాడుకోవచ్చు. ఈ ఆఫర్‌ ముగిసినా, ఏడాది పొడవునా విద్యార్థులు, సీనియర్‌ సిటిజన్లకు బేసిక్‌ ధరలో 10 శాతం రాయితీ ఇస్తామని సంస్థ పేర్కొంటోంది.

టాటా గ్రూపు భాగస్వామ్యంతో పని చేస్తున్న ఎయిరేషియా ఇండియా బేసిక్‌ ధర రూ.799 నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది. దీనికి పన్నులు అదనం. ఈనెల 17 వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. 

ఏయిరేషియా ఇండియా విమానాల్లో ప్రయాణ తేదీలు మాత్రం ఇప్పుడే కాదు. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 2020 జూన్‌ రెండో తేదీ వరకు ప్రయాణించవచ్చు. అంటే ఈ ఏడాది శీతాకాలంతో పాటు వచ్చే ఏడాది వేసవి సీజన్‌కు వాడుకోవచ్చన్న మాట.

పలు కొత్త మార్గాల్లో సర్వీసులు ప్రారంభించిన స్పైస్‌జెట్‌ రూ.2,293 కనీస ధరతో టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. ఆయా ప్రాంతాలను బట్టి ఈ ధరలు మారుతూ ఉంటాయి. ఈ నెల 7వరకు 3 రోజుల పాటు ఆఫర్లపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ టికెట్లు విక్రయించింది.

10 లక్షల టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ మధ్య ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌) ధరలు ఇప్పటికే 8% పెరిగినట్లు వార్తలొచ్చాయి.

సాధారణంగా విమానాల నిర్వహణ వ్యయంలో 40 శాతానికి  పైగా ఇంధన వాటా ఉంటుంది. ఏటీఎఫ్‌ ధర పెరిగినప్పుడు వెంటనే కాకున్నా, మెల్లగానైనా ఈ భారాన్ని ప్రయాణిలకు విమానయాన సంస్థలు బదలాయించక తప్పదు.

ఇంధన ధరలకు తోడు రూపాయితో పోలిస్తే డాలర్ మారకం విలువ అధికమైనా కూడా ఇది ఏటీఎఫ్‌ ధరపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు 119లో 70 మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. 

రుణ సంక్షోభంలో చిక్కుకున్నజెట్ ఎయిర్వేస్ గాడిన పడేవరకు విమాన సర్వీసులపై ప్రభావం పడుతూనే ఉంటుంది. అందువల్ల మిగిలిన విమాన సర్వీసులకు గిరాకీ పెరగొచ్చు. ఫలితంగా టికెట్ల ధరలు అధికం కావచ్చు.

ఇక ప్రయాణికుల సేవా రుసుము పెరిగినా, ఆ భారం కూడా టికెట్టు ధరలో జమ అవుతుంది. ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేసుకుంటే మాత్రం ఈ భారాల ప్రభావం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు.

ప్రయాణ తేదీలను ఖచ్చితంగా నిర్ణయించుకోగలిగిన వారే కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. వివాహాది శుభ కార్యాల తేదీలు ముందస్తుగా నిర్ణయమవుతాయి కనుక, వీటికి వెళ్లదలచినవారు కొనుగోలు చేసుకోవచ్చు.

ఉన్నత విద్యా సంస్థల్లో పరీక్షలు, సెలవుల ప్రణాళిక కూడా ముందస్తుగా సిద్ధమవుతాయి కనుక, స్నేహితులు కలిసి ఎక్కడికైనా వెళ్దామనుకుంటే ఇప్పుడే సన్నద్ధమవ్వడం మేలు. అయితే కార్యాలయాల్లో పనిచేస్తూ, సెలవులపై ఖచ్చితమైన నిర్ణయానికి రాలేని వారు, ఇప్పుడు ఆఫర్‌లో కొనుగోలు చేయడంపై ఆచితూచి వ్యవహరించాలి.