అదానీకి ఈ సారి జార్జ్ సోరోస్ దెబ్బ, కంపెనీలోకి విదేశీ నిధుల అవకతవకలపై OCCRP నివేదిక...స్టాక్స్ భారీగా పతనం
ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆధ్వర్యంలో నడిచే OCCRP సంస్థ అదానీ కంపెనీ విదేశీ నిధులపై సంచలన నివేదిక బయటపెట్టింది. దీంతో కంపెనీ షేర్లు గురువారం భారీగా పతనం అయ్యాయి.
అదానీ గ్రూప్ షేర్లు ఈ రోజు మళ్లీ క్షీణతను చవిచూశాయి. మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంట్రాడేలో 5 శాతం పడిపోయింది. అదానీ గ్రూప్ తన సొంత షేర్లను రహస్యంగా కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టిందని ఓ విదేశీ మీడియా గ్రూప్ పేర్కొంది. OCCRP అనే ఇండిపెండెంట్ జర్నలిస్టుల సంస్థ ఈ వివరాలు బయటపెట్టింది. OCCRP నివేదికలో అదానీ గ్రూప్ స్వయంగా మారిషస్ నుండి తన షేర్లను నిశ్శబ్దంగా కొనుగోలు చేసిందని ఆరోపించింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని షేర్లు భారీగా పతనం అయ్యాయి.
ప్రముఖ మిలియనీర్ జార్జ్ సోరోస్ మద్దతు ఉన్న మీడియా సంస్థ OCCRP, అదానీ గ్రూప్ తన స్వంత షేర్లను కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మిలియన్ల డాలర్లను రహస్యంగా పెట్టుబడి పెట్టిందని ఆరోపించింది. ఈ నివేదిక ప్రకారం, కనీసం రెండు ఇన్వెస్టర్లు విదేశీ కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ షేర్లను కొనుగోలు చేసి విక్రయించినట్లు ఆరోపించింది. OCCRP నివేదిక అదానీ గ్రూప్‌లో మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన నాసిర్ అలీ షాబాన్ అహ్లీ, చాంగ్ చుంగ్-లింగ్ అనే ఇద్దరు వ్యక్తుల గుర్తింపును వెల్లడించింది. ఈ వ్యక్తులు అదానీ గ్రూప్ కంపెనీలలో డైరెక్టర్లు, ఇన్వెస్టర్లుగా కూడా నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది సోరోస్-మద్దతుగల సంస్థల చర్యగా కనిపిస్తోందని పేర్కొంది. ఈ క్లెయిమ్‌లు నిరాధార ఆరోపణలు అని కొట్టి పారేసింది.
అదానీ గ్రూప్ స్టాక్ 5 శాతం పడిపోయింది
నేడు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఇంట్రాడేలో 5 శాతం క్షీణించి రూ. 2383.75కి పడిపోయింది. ఈ షేరు బుధవారం రూ.2513 వద్ద ముగిసింది. ప్రస్తుతం రూ.2451 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో అదానీ పవర్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి రూ.313 వద్దకు క్షీణించాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ నేడు 3.5 శాతం క్షీణించి రూ.812కి చేరుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ దాదాపు 4 శాతం క్షీణించి రూ.935కి చేరుకుంది. అదానీ పోర్ట్స్ & సెజ్ షేర్లు 3 శాతంపైగా క్షీణించి రూ.793కి చేరుకున్నాయి. అదానీ టోటల్ గ్యాస్ కూడా దాదాపు 3 శాతం బలహీనతను చూపిస్తూ రూ.635 వద్ద ట్రేడవుతోంది. అదానీ విల్మార్ స్టాక్ ఈరోజు 2 శాతం పడిపోయి రూ.362కి చేరుకుంది. అంబుజా సిమెంట్‌లో 4 శాతం, ఎన్‌డిటివిలో 2 శాతం, ఎసిసిలో 3 శాతం క్షీణత ఉంది.