అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన సంపద విలువను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టేస్తున్నారు. 

హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ అధినేత గౌతమ్ అదానీ అదరగొట్టారు. బుధవారం 2022 హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ విడుదల అయింది. గత సంవత్సరంలో అదానీ ఆదాయం 49 బిలియన్ డాలర్లు పెరిగింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.3.67 లక్షల కోట్లు. అంటే రోజుకు రూ.1000 కోట్లకు పైగా సంపాదించారు. మొత్తం ఆదాయపరంగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్స్ కంటే అదానీ సంపాదన ఎక్కువగా ఉండటం గమనార్హం.

81 బిలియన్ డాలర్లకు పెరిగిన సంపద..! 
హూరున్ రిచ్ లిస్ట్ జాబితా ప్రకారం గత ఏడాది అదానీ సంపద 153 రెట్లు పెరిగింది. గత అయిదేళ్ల కాలంలో అదానీ 86 స్థానాలు ముందుకు వచ్చారు. 2022 M3M హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ జాబితా ప్రకారం రిచ్చెస్ట్ ఎనర్జీ ఎంటర్‌ప్రెన్యూవర్ ఇతనే. 'M3M హూరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం గౌతమ్ అదానీ గత ఏడాది అందరికంటే ఎక్కువగా ఆర్జించారు. అతని ఆదాయం 49 బిలియన్ డాలర్లు పెరిగింది. ఎనర్జీ కంపెనీ అదానీ గ్రీన్ లిస్టింగ్ తర్వాత అతని ఆదాయం ఏకంగా 5 రెట్లు పెరిగి 2020లో 17 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇప్పుడు 81 బిలియన్ డాలర్లకు చేరుకుంది' అని పేర్కొంది.

పదేళ్లలో.. అంబానీ కంటే అదానీయే 
సంపద పరంగా మన దేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 103 బిలియన్ డాలర్లతో ముందున్నారు. మన కరెన్సీలో దాదాపు రూ.7.72 లక్ష‌ల‌ కోట్లు. 2020తో పోలిస్తే అంబానీ సంపద 24 శాతం పెరిగింది. అదానీ సంపద 81 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో ఇది రూ.6.07 లక్షల కోట్లు. మొదటి రెండు స్థానాల్లో వీరే ఉన్నారు. గత పదేళ్లలో ముఖేష్ సంపద 400 శాతం పెరగగా, అదానీ సంపద ఏకంగా 1830 శాతం పెరిగింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ 9, అదానీ 12వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ సంపద అయిదేళ్ల క్రితం 45 బిలియన్ డాలర్లు, పదేళ్ల క్రితం 20.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే అదానీ సంపద అయిదేళ్ల క్రితం 14 బిలియన్ డాలర్లు, పదేళ్ల క్రితం 8.8 బిలియన్ డాలర్లు.

భారత్ మూడో స్థానంలో..!
భారత్ నుండి 215 బిలియనీర్లు ఉన్నారు. 58 మంది కొత్తగా జత అయ్యారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ బిలియనీర్లు కలిగిన మూడో దేశం భారత్. చైనాలో 1133, అమెరికాలో 716 మంది తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 69 దేశాల్లోని 2557 కంపెనీలకు చెందిన 3381 మంది బిలియనీరల్ జాబితాలో ఉన్నారు.గత ఏడాది కనీసం 1 బిలియన్ డాలర్ల సంపదను జత చేసుకున్న వారి జాబితాలో కూడా భారత్ మూడో స్థానంలో ఉంది. ఏవియేషన్ బిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశం మనదే. ఇండిగో రాకేష్ గాంగ్వాల్, రాహుల్ భాటియా వరుసగా 4.3 బిలియన్ డాలర్లు, 4.2 బిలియన్ డాలర్లతో ముందున్నారు. గత పదేళ్లలో భారత కుబేరుల సంపదకు 700 బిలియన్ డాలర్లు లేదా రూ.52 లక్షల కోట్లుకు పైగా జత అయింది. అయిదేళ్ల క్రితం అంతర్జాతీయ కుబేరుల్లో భారత్ వాటా 4.9 శాతం కాగా, ఇప్పుడు 8 శాతం.

ముంబై టాప్..!
2021లో ఎక్కువగా సంపద పోగు చేసుకున్న వారిలో అంతర్జాతీయంగా అదానీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎల్‌వీఎంహెచ్ వ్యవస్థాపకులు, సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ ఉన్నారు. ముఖేష్ అంబానీ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. మన దేశానికి సంబంధించి ఎక్కువ మంది బిలియనీర్లు కలిగిన నగరంగా ముంబై (72), ఢిల్లీ (51), బెంగళూరు (28) ఉన్నారు. భారత్ నుండి టాప్ టెన్‌లో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడర్, సైరస్ పూనావాలా, లక్ష్మీ మిట్టల్, ఆర్కే దమానీ, ఎస్పీ హిందూజా, కేఎం బిర్లా, దిలీప్ సింఘ్వీ, ఉదయ్ కొటక్ టాప్ టెన్‌లో ఉన్నారు.