ప్ర‌ముఖ భార‌త పారిశ్రామిక‌వేత్త గౌత‌మ్ అదానీ సంప‌ద రోజురోజుకు పెరుగుతోంది. ఇప్ప‌టికే భార‌త్‌లో అప‌ర కుబేరుడిగా నిలిచిన అదానీ మ‌రో కొత్త రికార్డును చేరుకున్నారు.

ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Goutam adani) సంపద రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే భారత్ లో అపర కుబేరుడిగా నిలిచిన అదానీ మరో కొత్త మైలు రాయిని చేరుకున్నారు. 88.5 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ గా నిలిచారు. దేశీయ కుబేరుల జాబితాలో అగ్రగామిగా వెలుగొందుతున్న ముకేశ్‌ అంబానీకి గట్టి షాక్‌ తగిలింది. తొలి స్థానంలో కొనసాగుతున్న అంబానీ ర్యాంక్‌ రెండో స్థానానికి పడిపోయింది. అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ మొద‌టి ర్యాంక్‌ను దక్కించుకున్నారు. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌత‌మ్ అదానీ నికర విలువ సోమవారం $88.5 బిలియన్లకు చేరుకుంది. దింతో ముఖేష్ అంబానీ నిక‌ర విలువ‌ $87.9 బిలియన్లను గౌత‌మ్ అదానీ సంప‌ద‌ అధిగమించింది. దింతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. తన వ్యక్తిగత సంపద దాదాపు $12 బిలియన్ల పెరుగటంతో అదానీ ఈ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ధ‌న‌వంతుల‌ లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. సంపన్న వర్గాలకు చెందిన షేర్లు లాభ-నష్టాలతో వారి ర్యాంక్‌లు కూడా రోజువారిగా మారుతుంటాయి.

అదానీ కంపెనీల షేర్ల ధరల పెరుగుదల కారణంగా గత కొన్ని నెలలుగా అదానీ నికర విలువ గణనీయంగా పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజులుగా భారీ పతనం నమోదవగా.. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ కారణంగానే ముఖేష్ అంబానీ (Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ గ్రూప్ (Reliance Industries Ltd) నికర విలువ భారీగా ప‌డిపోయింది. అదే సమయంలో, అదానీ గ్రూప్ షేర్ల దూకుడు కొన‌సాగింది. దీంతో గౌతమ్ అదానీ నికర విలువ స్థిరంగా కొన‌సాగింది. దీంతో అదానీ దేశంలో రిచెస్ట్ ప‌ర్స‌న్ గా నిలిచారు. భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ (largest port operator)అదానీ గ్రూప్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. 

ఇటీవల, అదానీ గ్రూప్-దక్షిణ కొరియాకు చెందిన POSCO గుజరాత్‌లోని ముంద్రాలో గ్రీన్, పర్యావరణ అనుకూల ఇంటిగ్రేటెడ్ స్టీల్ మిల్‌ను అలాగే ఇతర వ్యాపారాల స్థాపనతో సహా వ్యాపార సహకార అవకాశాలను అన్వేషించడానికి ప్ర‌త్యేక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో పెట్టుబ‌డి విలువ USD 5 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా. POSCO-అదానీల మధ్య సంతకం చేయబడిన నాన్-బైండింగ్ ఎంఓయూ, కార్బన్ తగ్గింపు అవసరాలకు ప్రతిస్పందనగా పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్, లాజిస్టిక్స్ వంటి వివిధ పరిశ్రమలలో గ్రూప్ వ్యాపార స్థాయిలో మరింత సహకరించాలని భావిస్తోంది. అదానీ నికర విలువ ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ నికర విలువను కూడా అధిగమించింది. మేయర్స్ నికర విలువ $82.9 బిలియన్లు.

ఫ్రెంచ్ సంస్థతో ముంబై-లిస్టెడ్ జాయింట్ వెంచర్ అయిన అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 2020 ప్రారంభం నుండి 1,000 శాతం కంటే ఎక్కువ చేశారు. ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 730 శాతం కంటే ఎక్కువ పురోగమించింది. అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ఈ కాలంలో 500 శాతం కంటే ఎక్కువ, అదానీ పోర్ట్స్ 95 శాతం, బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్‌తో పోల్చి చూస్తే 40 శాతం లాభపడింది.

గతేడాది.. 2021 ఏప్రిల్ నాటికి అదానీ నెట్ వర్త్ 50.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. అప్పుడు ఫోర్బ్స్ వార్షిక బిలియనీర్స్ జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి అదానీ సంపద గణనీయంగా వృద్ధి చెందింది. కానీ, అదే కాలంలో అంబానీ నెట్ వర్త్ కేవలం 6.5 శాతమే (84.5 బిలియన్ డాలర్ల నుంచి ) పెరిగింది. అదానీ తొలిసారి 2008లో ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించారు. అప్పుడు ఆయన సంపద విలువ 9.3 బిలియన్ డాలర్లు. అప్పటి నుంచి 10 రెట్లు పెరిగింది.

అంతర్జాతీయ కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న అదానీ ఆస్తులు విలువ 88.5 బిలియన్ డాలర్లు కాగా.. 11వ స్థానంలో ఉన్న అంబానీ ఆస్తుల విలువ 87.9 బిలియన్​ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో 239.6 బిలియన్​ డాలర్లతో ఎలాన్​ మస్క్​ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్​ 194.6 బిలియన్​ డాలర్లతో రెండో స్థానంలో, జెఫ్​ బెజోస్​ 183.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. బిల్​గేట్స్​132.2 బిలియన్​ డాలర్ల సంపదతో 4వ‌ స్థానంలో కొనసాగుతున్నారు.