పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోడీ తాజాగా లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. నగర వీధుల్లో చాలా స్వేచ్చగా తిరుగుతూ ఓ బ్రిటన్ విలేకరికి చిక్కాడు.

ఆ వెంటనే సదరు రిపోర్టర్ అతని వద్దకు వెళ్ళి నీరవ్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. అన్నింటికి అతను నో కామెంట్స్ అని సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. నిఘా వర్గాలు, ఇతరులు తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు గాను మీసాలు, గడ్డాలు పెంచాడు.

అంతేకాకుండా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ సైతం చేయించుకున్నట్లు తెలుస్తోంది. నీరవ్‌తో సంభాషణను సదరు రిపోర్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇన్నాళ్లకు నీరవ్ ఆచూకీ వెలుగు చూసింది.

ఈ సమయంలో నీరవ్ వేసుకున్న కోట్ ధర సుమారు రూ.7 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీరవ్ మోడీ లండన్ సెంట్రల్ పాయింట్ టవర్ బ్లాక్‌లోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం.

దాని అద్దె నెలకు రూ.16 లక్షలు. అంతేకాకుండా బ్రిటన్ కేంద్రంగా నీరవ్ తిరిగి వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశం విడిచి పారోయిన నీరవ్‌ను పట్టుకునేందుకు సీబీఐ, ఈడీలు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశాయి.