Asianet News TeluguAsianet News Telugu

ట్రావెల్ ఏజెంట్ టు జెట్ అధిపతి.. దటీజ్ నరేశ్ గోయల్

నరేశ్ గోయల్.. జెట్ ఎయిర్వేస్ అధినేతగా సుపరిచితుడు. హర్యానాలోని పాటియాలలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన కుటుంబ వారసుడిగా ఢిల్లీకి చేరుకుని ట్రావెల్ ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఏజెన్సీ అటుపై ఏకంగా జెట్ ఎయిర్వేస్ స్థాపించి పరిశ్రమ వర్గాలనే నివ్వెరపరిచారు.

From travel agent to Czar of aviation: Highs and lows of Naresh Goyals journey
Author
New Delhi, First Published Mar 27, 2019, 10:58 AM IST

న్యూఢిల్లీ: నరేశ్ గోయల్.. ఇటీవలి కాలంలో నెటిజన్లు, పత్రికలు, టీవీ మీడియాకు సుపరిచితమైన పేరు. మొన్నటి వరకు ఒక ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థకు వ్యవస్థాపక అధిపతిగా ఉన్న నరేశ్ గోయల్ సామాన్యులకు విమానయాన అవకాశం కల్పించిన సామాన్యుడు. 

26 ఏళ్లకు పైగా జెట్ ఎయిర్‌వేస్ సారథ్య బాధ్యతల్ని మోసిన గోయల్ సామర్థ్యాన్ని సంక్షోభంలో రూపంలో సంస్థ ప్రశ్నించింది. ఫలితంగా భార్యతోపాటు ఆయన బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. 1967లో 18 ఏళ్ల యువకుడిగా ఢిల్లీకి పొట్ట చేత పట్టుకుని వచ్చిన గోయల్.. భారతీయ విమానయాన రంగంలో సంచలనమే సృష్టించారు. 

1949, జూలై 29న జన్మించిన గోయల్‌ది ఓ నిరుపేద కుటుంబం. హర్యానాలోని పాటియాలాలో గోయల్ బాల్యం.. రోజూ కనీసం రెండు పూటలా తిండి కూడా దొరుకని కటిక దారిద్య్రంలో సాగింది. బహుశా ఈ ఆకలి బాధే ఆయనలో కసి పెంచి గొప్ప విజయాల్ని సాధించేలా చేసి ఉండొచ్చు.

ఢిల్లీకి చేరిన గోయల్.. తన తల్లి బంధువొకరు కన్నాట్ ప్లేస్‌లో నడుపుతున్న ట్రావెల్ ఏజెన్సీలో నెలకు దాదాపు రూ.300 జీతానికి చేరారు. ఈ క్రమంలో ట్రావెల్ ఇండస్ట్రీలో పెరిగిన పరిచయాలు గోయల్‌కు బాగా కలిసొచ్చాయి. జోర్డాన్, గల్ఫ్, ఆగ్నేయాసియా వంటి విదేశీ ఎయిర్‌లైన్స్‌ల్లోని స్నేహితుల ద్వారా పరిశ్రమపై అవగాహన పెంచుకున్నారు. 

1973లో సొంతంగా ఓ ట్రావెల్ ఏజెన్సీని గోయల్ ప్రారంభించారు. దీని పేరు జెట్ ఎయిర్. ఎయిర్‌లైన్స్ కార్యాలయాలకు టిక్కెట్ల సేకరణకు వెళ్లినప్పుడు గోయల్‌ను అంతా.. ట్రావెల్ ఏజెన్సీకి ఎయిర్‌లైన్స్ పేరు పెట్టాడు చూడండంటూ ఆట పట్టించేవారు. కానీ నిజంగానే గోయల్ ఓ విమానయాన సంస్థ అధిపతి అవుతారని.. అలా నవ్విన వారెవరూ ఊహించి ఉండరు.

అనూహ్యంగా ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ 1993 మే నెలలో గోయల్..జెట్ ఎయిర్‌వేస్‌ను స్థాపించారు. రెండు బోయింగ్ 737-300 విమానాలతో సేవలను మొదలు పెట్టారు. తొలుత నిధుల సమీకరణకు ఇబ్బందిపడ్డ గోయల్.. ఆ తర్వాత నిలదొక్కుకున్నారు. 

ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్‌లో అగ్రగామి ఎయిర్‌లైన్స్‌గా జెట్ ఎయిర్‌వేస్‌ను నిలబెట్టారు నరేశ్ గోయల్. 2002లో అప్పటి ఇండియన్ ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటానూ అధిగమించారు. 2005లో జెట్ ఎయిర్‌వేస్ స్టాక్‌మార్కెట్లలోకి ప్రవేశించింది. 

2006లో ఎయిర్ సహారాను రూ. 2,250 కోట్లతో నరేశ్ గోయల్ కొనుగోలు చేశారు. 2007లో దీని పేరును జెట్‌లైట్‌గా మార్చారు. దాదాపు 20 ఏళ్లు అగ్రస్థాయిలో దూసుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ జోరు.. 2012 నుంచి తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాదే జెట్ మార్కెట్ వాటాను ఇండిగో అధిగమించింది.

ఇక 2013 నవంబర్‌లో జెట్‌లో 24 శాతం వాటాను ఎతిహాద్ ఎయిర్‌వేస్ కొనుగోలు చేసింది. గోయల్ వాటా 51 శాతానికి పరిమితమైంది. 2018 నవంబర్ 12న సంస్థ మూడోసారి త్రైమాసిక నష్టాలను ప్రకటించగా, 22న స్వతంత్ర డైరెక్టర్ రంజన్ మథాయ్ రాజీనామా చేశారు.

గతేడాది డిసెంబర్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ కష్టాలు తీవ్రతరమయ్యాయి. ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా ఇస్తున్న సంస్థ.. డిసెంబర్‌లో బకాయిలన్నింటిని ఏప్రిల్‌కల్లా తీరుస్తామని హామీనిచ్చింది. ఈ ఏడాది జనవరిలో బ్యాంకులకు చేయాల్సిన రుణ వాయిదా చెల్లింపులనూ చేయలేకపోవడంతో దీంతో రేటింగ్ దిగజారింది. 

సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకులకు వాటాలు ఇవ్వాలని ఫిబ్రవరి 14న జెట్ ఎయిర్‌వేస్ బోర్డు తీర్మానించింది. 15న 840 మిలియన్ డాలర్ల సాయాన్ని వాటాదారుల నుంచీ కోరింది. 21న రుణాలను ఈక్విటీగా మార్చేందుకూ బోర్డు అంగీకరించింది.

ఈ నెల 19న ఎతిహాద్‌ను రూ.750 కోట్ల సాయం చేయాలని అభ్యర్థించిన గోయల్‌కు నిరాశే ఎదురవగా, బోర్డులోకి బ్యాంకర్ల రాకతో గోయల్ భార్యతోసహా సోమవారం బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. గోయల్ వాటా 25 శాతానికి, ఎతిహాద్ వాటా 12 శాతానికి పడిపోగా, బ్యాంకర్ల వాటా 51 శాతానికి చేరింది. గోయల్‌కు భార్య, ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios