Asianet News TeluguAsianet News Telugu

శూన్యం నుంచి సర్వం వరకూ..ఆకాశమే హద్దుగా ఎలాన్ మస్క్ ప్రయాణం..యువతకు కిక్కు ఎక్కించే సిసలైన జీవిత పాఠం..

సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను కొనుగోలు చేసి ఎలాన్ మస్క్ నేడు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించారు.  భూమిపైనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్  జీవితం గురించి అంతా తెలుసు కోవాలని ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. నిజానికి మస్క్ ఏ రాచ కుటుంబంలోనూ జన్మించలేదు. ఏ వ్యాపార సామ్రాజ్యానికి అతను వారసుడు కాదు. కేవలం తన మేధస్సును,  తెలివితేటలను అన్నిటికీ మించి మనసుకు నచ్చిన పని చేసుకుంటూ నిజమైన కిక్కు కు అర్థం చెబుతూ శూన్యం నుంచి సర్వం వరకూ విస్తరించాడు మస్క్. అతని జీవితంలోని కొన్ని మైలురాళ్లను తెలుసుకుందాం. 

 

From nothing to everything the sky is the limit Elon Musks journey a real life lesson to kick the youth
Author
First Published Oct 28, 2022, 1:44 PM IST

ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ కృషి పట్టుదల మాత్రం ఉంటే సరిపోదు జీవితంలో కిక్కు కూడా సినిమాల్లో హీరోలు చెబుతుంటారు.  సరిగ్గా అలాంటి లక్షణాలకు ప్రతిరూపమే ఎలాన్ మస్క్. 2009లో రిలీజ్ అయిన తెలుగు సినిమా కిక్ లో  హీరో క్యారెక్టరైజేషన్ చాలా వింతగా ఉంటుంది. ఒక లక్ష్యం కోసం కాకుండా ఎగ్జయిట్ మెంట్ కోసం, కిక్కు కోసం ఆ సినిమాలో హీరో వింత వింత  పనులన్నీ చేస్తూ ఉంటాడు. అయితే నిజ జీవితంలో అలాంటి మనస్తత్వం కలవారు జీవితంలో పైకి రాలేరని, అప్పట్లో చాలా మంది పెదవి విరిచారు.  కానీ జీవితంలో ఎదగాలంటే  ఒక సూత్రం  అంటూ ఏదీ లేదని, ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ వెళితే అందులో సక్సెస్ చూడొచ్చని ఎలాన్ మస్క్ ప్రపంచానికి నిరూపించాడు.  

మస్క్ భూమిపై అత్యంత ధనవంతుడిగా ఈరోజు నిలిచాడు. తలాతోకా లేని ఒక అనామక Tesla కంపెనీని కొనుగోలు చేసి దాన్ని ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మార్చిన ఘనత ఆయన సొంతం.  సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఈ దిగ్గజ కుబేరుడు నేడు అమెరికాలోనే కాదు భూమి పైనే  అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు అతని జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం. 

ఎలాన్  మస్క్ నేడు ప్రపంచం మొత్తంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉండటమే కాకుండా, అతన్ని భవిష్యత్తు నిర్మాత అని కూడా పిలుస్తారు. అతను ఎలాక్ట్రిక్ కార్ల నుంచి వ్యోమనౌకలను తయారు చేసే స్పేస్ X వరకూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతను ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కూడా. ఈ స్థాయికి చేరుకోవడానికి, అతను కష్టపడి అన్ని అడ్డంకులను అధిగమించి తన లక్ష్యాన్ని సాధించాడు. 

ఎలాన్  మస్క్  ఎక్కడ జన్మించాడు…
ఎలాన్  మస్క్ 28 జూన్ 1971న దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌వాల్‌లోని ప్రిటోరియాలో జన్మించాడు. ఎలాన్  మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ ఎలక్ట్రికల్ ఇంజనీర్  పైలట్. అదే సమయంలో, అతని తల్లి మే మస్క్ డైటీషియన్. అలాన్ తన ముగ్గురు తోబుట్టువులలో పెద్దవాడు. అతని సోదరుడు కింబాల్ మస్క్ ఓ పర్యావరణవేత్త. అతని సోదరి టోస్కా మస్క్ సినీ నిర్మాత  దర్శకురాలు. ఎలాన్ 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎలాన్  తన తండ్రితో కలిసి జీవించడం ప్రారంభించాడు  దక్షిణాఫ్రికాలోనే తన ప్రాథమిక చదువును పూర్తి చేశాడు.

చిన్నతనంలో జీనియస్ మస్క్

ఎలాన్  మస్క్ 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, చాలా పుస్తకాలు చదివాడు, గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కూడా ఆ పుస్తకాలను చదివి ఉండరు. ఎలాన్‌కి చిన్నప్పుడే పుస్తకాల సాయంతో కంప్యూటర్‌లో ప్రోగ్రామింగ్‌ నేర్చుకుని బ్లాస్ట్‌ పేరుతో గేమ్‌ చేశాడు. అతను ఈ గేమ్‌ను ఒక అమెరికన్ కంపెనీకి కేవలం 500 డాలర్లకు విక్రయించాడు. ఎలాన్ చిన్నతనంలో తన క్లాస్‌మేట్స్ ద్వారా చాలా వేధింపులకు గురయ్యాడు. దీని కారణంగా ఎలాన్  మస్క్ తరచూ గొడవ పడేవాడు. ఒకసారి వారితో పోరాడుతుండగా నిచ్చెనపై నుంచి కిందపడి స్పృహతప్పి పడిపోయాడు. ఆ సంఘటన నుండి, ఎలాన్ ఈ రోజు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటాడు. 

ఫిజిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్,

ఎలాన్  ఉన్నత విద్య కోసం 1988లో కెనడియన్ పాస్‌పోర్ట్‌ను అందుకున్నాడు, ఆ తర్వాత అతను దక్షిణాఫ్రికాను విడిచిపెట్టి ఒంటారియోలోని కింగ్‌స్టన్‌లోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరాడు. ఎలాన్  1992లో ఇక్కడి నుంచి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియాకు బదిలీ అయ్యాడు. ఇక్కడ అతను 1997లో ఫిజిక్స్, ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. తరువాత అతను కాలిఫోర్నియాకు వెళ్లాడు, అక్కడ అతను PhD కోసం స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ తీసుకున్నాడు.  కానీ రెండు రోజుల తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి తప్పుకున్నాడు. భౌతికశాస్త్రం కంటే సమాజాన్ని మార్చే శక్తి ఇంటర్నెట్‌కు ఉందని ఎలాన్  నమ్మాడు. దీని తర్వాత, అతను 1995లో అమెరికాలో తన సోదరుడితో కలిసి జిప్2 పేరుతో కంపెనీని స్థాపించాడు.

Paypalతో తొలి విజయం

ఎలాన్  స్థాపించిన జిప్2 కంపెనీ ఆన్‌లైన్ వార్తలు,  మ్యాప్‌లను అందించేది. 1999లో Zip2ను కంప్యూటర్ తయారీదారు కాంపాక్ 307 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది, ఎలాన్  తన వాటా కింద 22 మిలియన్ డాలర్లను పొందాడు. మస్క్ ఆ తర్వాత X.com అనే ఆన్‌లైన్ ఫైనాన్స్ సర్వీస్ కంపెనీని స్థాపించాడు, అది తర్వాత పే పాల్‌గా మారింది. ఇది ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కంపెనీ. 2002లో ఆన్‌లైన్ వేలంలో పేపాల్‌ని eBay కంపెనీ 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

రాకెట్ తయారు చేసిన మస్క్

ఈ విజయాల తరువాత, ఎలాన్  మస్క్ తాను ముందుకు సాగాలంటే, ప్రపంచానికి భిన్నంగా ఆలోచించవలసి ఉంటుందని అర్థం చేసుకున్నాడు. ఈ రెండు విజయాల తర్వాత, ఎలాన్ ‌దగ్గర చాలా డబ్బు ఉంది. దీంతో తాను అంతరిక్ష రంగంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అని  ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ తర్వాత అతను 3 ICBM రాకెట్లను పొందడానికి 2003లో రష్యాకు వెళ్లాడు, అక్కడ అతను  8 మిలియన్లకు కేవలం ఒక రాకెట్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇంత భారీ మొత్తం చెల్లించడం కంటే తానే రాకెట్‌ను తయారు చేయడం మంచిదని ఎలాన్ ‌ భావించాడు. ఎలాన్  మస్క్ తిరిగి వచ్చి రాకెట్ సైన్స్ చదవడం ప్రారంభించాడు.

ఎలాన్  ఒక సంవత్సరంలోనే తన స్వంత రాకెట్‌ను తయారుచేశాడు. ఆ తర్వాత SpaceX కంపెనీని స్థాపించాడు. అయితే, ఎలాన్  మొదటి రాకెట్ విఫలమైంది. మరోసారి ప్రయత్నించాడు. కానీ అది కూడా విజయవంతం కాలేదు. చేతిలో డబ్బు కూడా ఖర్చయిపోయింది. నాశనం అయిన రాకెట్  మిగిలిన భాగాలతోనే అతను  కొత్త రాకెట్‌ తయారు చేయాలని భావించారు. కానీ ఇది కూడా విజయవంతం కాలేదు. నాలుగో ప్రయత్నంలో ఎలాన్  విజయం సాధించాడు. అతి తక్కువ ఖర్చుతో రాకెట్‌ను రూపొందించి అంతరిక్షంలోకి తీసుకెళ్లాడు. నేడు, నాసా కూడా ఎలాన్ మస్క్ తయారు చేసిన రాకెట్‌ను ఉపయోగిస్తోంది.

ఎలాన్  మస్క్ - టెస్లాతో అనుబంధం...
ఎలాన్  మస్క్ సాధించిన విజయాలలో టెస్లాకు పెద్ద హస్తం ఉంది. ఎలాన్ ‌కు రాకముందు, టెస్లా తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనం చాలా ఖరీదైనది. అందుకే టెస్లా తయారు చేసిన కార్లు మార్కెట్‌లో విజయం సాధించలేకపోయాయి. టెస్లా కంపెనీలో ఎలాన్ ‌కు వచ్చినప్పుడు, అతను ఎలక్ట్రికల్ కార్లను చౌక ధరలకు తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీని తయారుచేశాడు. దీంతో మార్కెట్లో  ఈ కార్లు చాలా వేగంగా అమ్మడు పోవడం ప్రారంభించాయి. 

టెస్లా కంపెనీని ముందుకు తీసుకువెళుతున్న సమయంలో ఎలాన్  ఇన్వెస్టర్ గా అవతారం ఎత్తాడు. అతను 2006లో తన బంధువు కంపెనీ సోలార్ సిటీలో పెట్టుబడి పెట్టాడు  అతి తక్కువ సమయంలో, ఈ కంపెనీ అమెరికాలో రెండవ అతిపెద్ద సోలార్ కంపెనీగా ఎదిగింది. 2013లో, ఎలాన్  మస్క్ ఈ కంపెనీని టెస్లాతో విలీనం చేశారు. నేడు సోలార్ సిటీ  టెస్లా కొత్త టెక్నాలజీపై కలిసి పనిచేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios