Asianet News TeluguAsianet News Telugu

అమ్మబాబోయ్ ‘ఆర్-కామ్’:రుణ దాతల్లో టెన్షన్

15 ఏళ్ల క్రితం టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పిన అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ సారథ్యంలోని ఫ్లాగ్ షిప్ సంస్థ ‘రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్)’రుణాలు చెల్లించలేక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసింది. ఫలితంగా ఆర్ కాంతోపాటు అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లన్నీ స్టాక్ మార్కెట్లో నేల చూపులు చూశాయి. ఒకనాడు అవిభాజ్య రిలయన్స్ గ్రూపు సీఎఫ్ఓగా వ్యూహాలు రచిస్తూ డీల్స్ ఖరారులో కీలక పాత్ర పోషించిన అనిల్ అంబానీ.. తన సొంత సంస్థలను గట్టెక్కించుకునేందుకు మరొకరి చేయూత కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.. ఓడలు బళ్లు.. బళ్లు ఓడలంటే ఇదేనేమో..

From glory to dust: An Ambani brand's journey to bankruptcy
Author
Hyderabad, First Published Feb 5, 2019, 11:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ధీరూభాయి అంబానీ ఉండగా అవిభాజ్య రిలయన్స్ గ్రూప్‌లో అనిల్‌ అంబానీ సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా (సీఎఫ్‌ఓ)గా వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా ఒప్పందాలను కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కానీ ధీరూభాయి అంబానీ తర్వాత అన్నదమ్ములు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. 

ఒకనాడు సంపన్నులుగా పోటీ పడ్డా అంబానీ బ్రదర్స్
దేశంలోనే అత్యంత సంపన్నులుగానువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్‌ అంబానీతో పోటీపడిన అనిల్‌ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్‌ అంబానీ 47 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతున్నారు. రెండు బిలియన్‌ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్‌ అంబానీ కనీసం దేశీయ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి పడిపోయారు. 

ముకేశ్ ‘రిలయన్స్’ రూ.8 లక్షల కోట్లకు ఎం క్యాప్
దశాబ్దిలోనే అన్న ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినా... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేసి.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్‌ అంబానీ సారథ్యంలోని అడాగ్‌ గ్రూప్‌ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది.

15 ఏళ్ల క్రితం టెలికం రంగంలో ఆర్ కామ్ సంచలనం
పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్‌ షిప్‌ కంపెనీ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ప్రస్తుతం దాదాపు రూ. 46వేల కోట్ల పైచిలుకు రుణాల భారంతో దివాలా తీసింది. అడాగ్ ఫ్లాగ్ షిప్ సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) ఒకప్పుడు టెలికం రంగంలో సంచలనం. 15 ఏళ్ల క్రితం మొబైల్‌ టెలిఫోన్‌ సేవలందించటంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న కంపెనీ  ప్రస్తుతం రోజువారీ కార్యకలాపాల కోసం మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి.

ఇలా దివాళా దశకు ఆర్ కామ్
వ్యాపార నిర్వహణకు తీసుకున్న రుణాలను చెల్లించలేక ఆర్‌ కామ్‌ దివాలా దశకు చేరింది. దీంతో కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆస్తుల విక్రయం ద్వారా బకాయిలు పూర్తిగా వసూలవుతాయో లేదోనని రుణదాతలు భయపడుతున్నారు.

దివాళా ప్రొసీడింగ్స్ ఎంచుకున్న ఎన్సీఎల్టీ
రుణదాతల అప్పులు చెల్లింపునకు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించినా సాధ్యంకాలేదని ఆర్‌కామ్‌ గత వారం ప్రకటించింది. రుణాలను చెల్లించలేకపోవటంతో దివాలా ప్రొసీడింగ్స్‌ను ఎంచుకుంది. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముసాయిదాకు అనుగుణంగా రుణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. 

కుప్పకూలిన ఆర్ కామ్ షేర్
దివాల పరిష్కార చర్యలకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఆర్‌కామ్‌ ప్రకటించటంతో సోమవారం స్టాక్‌ మార్కెట్లో కంపెనీ షేరు కుప్పకూలింది. బీఎస్ఈలో ఆరంభం నుంచి పతనబాటలో సాగిన షేరు ఒక దశలో 48.27 శాతం మేర పడిపోయి రికార్డు కనిష్ఠ స్థాయి రూ.6కు చేరింది. 
 
ఇతర కంపెనీలదీ అదేబాట
ఆర్‌కామ్‌తోపాటు అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలైన రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఆర్‌పవర్‌ షేరు ఏకంగా 35.10 శాతం నష్టంతో రూ.17.10 వద్ద, ఆర్‌క్యాపిటల్‌ 19.80 శాతం నష్టపోయి రూ.151.70 వద్ద, ఆర్‌ఇన్‌ఫ్రా షేరు 14.87 శాతం క్షీణించి రూ.227.25 వద్ద, రిలయన్స్‌ నావల్‌ షేరు 14.72 శాతం నష్టపోయి రూ.10.08 వద్ద క్లోజయ్యాయి.
 
అనిల్ అంబానీకి సుప్రీం నోటీసులు
ఆర్‌కామ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. అనిల్‌ అంబానీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్‌ ఇండియా.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రూ.550 కోట్ల బకాయిలు చెల్లించకుండా రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌తో డీల్‌ కుదుర్చుకుందని, ఈ కేసులో న్యాయస్థానం బకాయిలు చెల్లించాలని ఆదేశించినా ఆర్‌కామ్‌ పట్టించుకోలేదని పేర్కొంది. కోర్టు ధిక్కార నేరం కింద అనిల్‌ అంబానీని జైలుకు పంపాలని కోరింది. 

బకాయిల చెల్లింపునకు రూ.118 కోట్లు డిపాజిట్ చేసేందుకు ఓకే
సుప్రీం కోర్టు.. అనిల్‌ అంబానీకి నోటీసులు జారీ చేసింది. కాగా కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీ దగ్గర బకాయిల చెల్లింపు నిమిత్తం రూ.118 కోట్లు డిపాజిట్‌ చేసేందుకు ఆర్‌కామ్‌కు జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ నేతృత్వంలోని బెంచ్‌ అనుమతినిచ్చింది. రెండు డిమాండ్‌ డ్రాఫ్ట్స్‌ రూపంలో ఈ మొత్తాలను చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆర్‌కామ్‌ తెలిపింది.
 
ఆర్ కామ్ రుణ భారం 46,000 కోట్లు
ప్రస్తుతం ఆర్‌కామ్‌ రుణ భారం రూ.46,000 కోట్లు. 2017 జూన్‌ 2 నుంచే వ్యూహాత్మక రుణ పరిష్కార ప్రణాళికను ప్రారంభించింది. ఒక దశలో ముకేశ్‌ అంబానీ కంపెనీ ఆర్‌జియో.. అనిల్‌ అంబానీని గట్టెక్కించేందుకు రూ.25వేల కోట్లతో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే రెగ్యులేటరీ అనుమతులు రాకపోవటంతో సంక్షోభంలోకి జారుకుంది. ఈ 18 నెలల్లో ఆస్తులు, స్పెక్ట్రమ్‌ విక్రయం వంటి వాటి ద్వారా బయటపడాలని భావించినా ప్రయోజనం కలుగలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios