సీలింగ్‌ను తాకేలా పొడవైన ఫ్రెంచ్‌ కిటికీలు..టాయిలెట్లు, 24 గంటలూ నీటి వసతి.. తాజా తెల్లటి పెయింట్‌తో నిగనిగలాడుతున్న గోడలు.. ఫ్యాన్లు, కళ్లు జిగేలు మనిపించే లైట్లు.. మెత్తటి పరుపులు గల విలాసవంతమైన మంచాలు..సీసీ కెమెరాలు.. ఇవి సంపన్నులు ఉండే రిసార్టులు లేదా విలాసవంతుల ఇండ్లు, ఇదేదో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ప్రకటన అనుకునేరు. 

ఒక జైలు గది సమాచారం. ఇది కేవలం వేల కోట్ల కొద్దీ కుంభకోణాలు చేసిన వారు.. బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ కోసం మహారాష్ట్ర జైళ్లశాఖ ముంబై ఆర్టర్ రోడ్డులోని జైలు గదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. .

వారింకా భారత్‌కే రాలేదు కదా అన్న అనుమానం మీకు వస్తుంది. అవును ఇంకా రాలేదు కానీ.. భారత్‌కు రప్పించే అన్ని కార్యక్రమాలూ సక్రమంగా పూర్తయితే వారిని ఉంచేందుకు ముందుగానే సిద్ధం చేశారు. సాధారణంగా ఒక గదిలో ముగ్గురిని ఉంచుతారు. 

ఆర్టర్ జైలు వర్గాలు తెలిపిన వివరాల మేరకు సెల్‌ నంబర్- 2లో వీరిద్దరిని మాత్రమే ఉంచనున్నారు. ఈ బరాక్‌(జైలు భవనాల్లో ఒక భాగం)ను రెండంతస్థుల భవనంగా నిర్మించారు. ఒక్కో అంతస్తులో రెండు గదులుంటాయి. 

ఇప్పటికే నీవర్‌ మోదీకి చెందిన బెయిలు పిటిషన్‌ను బ్రిటన్‌ హై కోర్టు నాలుగోసారీ తిరస్కరించింది. దీంతో ఇక ఆయనను భారత్‌కు తేవడం తథ్యమని భావించిన ముంబై జైలు అధికారులు ఆర్థర్‌ రోడ్‌ జైలులోని ‘పూర్తి స్థాయి హంగులతో ఉన్న’ గదిని చివరిసారిగా తనిఖీ చేశారని అత్యున్నత స్థాయి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

బరాక్‌ 12లోని సెల్‌ నంబర్- 2ను ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ప్రిజన్స్‌) దీపక్‌ పాండే, ఆయన బృందం బుధవారం పరిశీలించినట్లు తెలుస్తోంది. భద్రతా ఏర్పాట్లు కూడా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ‘పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ గదిలో స్టూడియో అపార్ట్‌మెంట్‌ తరహాలోనే సదుపాయాలున్నాయి’ అని పాండే ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. 

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ)ని రూ.14 వేల కోట్ల మేర మోసం చేశారన్న మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నుంచి ఆయన లండన్‌లోని వాండ్స్‌వర్త్‌ జైలులో ఉన్నారు. అతడ్ని స్వదేశానికి రప్పించడానికి గట్టి యత్నాలే చేస్తోంది. 

ముంబై జైలు అధికారులు ఇటీవలే బరాక్‌ 12ను పునర్నిర్మించారు. ఇటువంటి మరో రెండు బ్లాకులను త్వరలోనే నిర్మించనున్నారు. ఈ బ్లాకుల్లోని గదులను అండర్‌ట్రయల్స్‌గానే భావిస్తున్నారు. కొత్త కాంప్లెక్స్‌ను అత్యంత భద్రత గల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రధాన భవనానికి దూరంగా ఉంటుంది. 

ఇంకా బరాక్‌ 12ను రెండంతస్తుల భవనంగా నిర్మించారు. ఒక్కో అంతస్తులో రెండు గదులు ఉంటాయి. సెల్‌ నంబర్- 2 పై అంతస్తులో ఉంటుంది. షీనా బోరా హత్య కేసులో నిందితుడు పీటర్‌ ముఖర్జీ కింది అంతస్తులోని గదిలో ఉంటారు. ఇక పై అంతస్తులోని ఇంకో సెల్‌లో 26/11 పేలుళ్ల కేసులో నిందితుడు అబు జుందాల్‌ ఉంటారు. 

సీసీ కెమేరాలనూ ఈ గదుల్లో ఉంచారు. 24 గంటలూ వారిని గమనించడమే కాదు.. వీటిని వీడియో కాన్ఫరెన్స్‌కూ ఉపయోగించుకోవచ్చు. ఇక ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునే వీలుంటుందా? లేదా జైలు వంటలే తినాల్సి ఉంటుందా? అన్నది కోర్టు నిర్ణయిస్తుంది.