Asianet News TeluguAsianet News Telugu

ఫొర్టిస్ సంక్షోభం: నా భార్త సంతకం ఫొర్జరీ.. అన్నపై శివీందర్ సంచలన ఆరోపణ

ఫోర్టిస్, ర్యాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన అన్న మల్వీందర్ సింగ్ తన భార్య అదితి సింగ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, అక్రమ  ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీని భారీ రుణాల్లో ముంచేశారని ఆరోపించారు

Fortis feud: Shivinder accuses Malvinder of forging wife's signature
Author
New Delhi, First Published Sep 6, 2018, 11:12 AM IST

న్యూఢిల్లీ: ఫోర్టిస్, ర్యాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన అన్న మల్వీందర్ సింగ్ తన భార్య అదితి సింగ్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, అక్రమ  ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీని భారీ రుణాల్లో ముంచేశారని ఆరోపించారు. ఈ మేరకు మల్వీందర్ సింగ్‌తోపాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్‌లో శివీందర్‌ సింగ్‌ ఆరోపించారు.

శివీందర్‌ తరఫున ఆర్‌ఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ వేసిన పిటిషన్‌ గురువారం విచారణకు రానున్నది. వీరిద్దరూ కలిసి కంపెనీ, షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.  రెలిగేర్‌కి చెందిన ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో తీసుకున్న నిర్ణయాలు, ర్యాన్‌బాక్సీని దైచీకి విక్రయించే డీల్‌ నిర్వహణ, ప్రైవేట్‌ చార్టర్‌ లిగేర్‌ ఏవియేషన్‌ వ్యాపారంలో అనూహ్య నష్టాలు మొదలైనవన్నీ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిపోయిందో చెప్పడానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్‌హెచ్‌సీ బోర్డు నుంచి మల్వీందర్‌ను తొలగించాలని, బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని పిటిషన్‌లో శివీందర్‌ కోరారు. 

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, రెలిగేర్‌ల నుంచి చట్టవిరుద్ధంగా తీసుకున్న నిధులను కూడా వాపసు చేసేలా మల్వీందర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ రికార్డులన్నీ తనిఖీ చేసి, అవసరమైన పత్రాల కాపీలు తీసుకునేందుకు తనకు గానీ, అధీకృత వ్యక్తులకు గానీఅనుమతివ్వాలని కోరారు. సింగ్‌ సోదరుల కుటుంబాలకు చెందిన ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌కి మల్వీందర్‌ సింగ్‌ ఎండీగా ఉన్నారు.

ర్యాన్‌బాక్సీని జపాన్‌కి చెందిన దైచీ సాంక్యోకు విక్రయించిన సింగ్‌ సోదరులు ప్రస్తుతం ఈ డీల్‌ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు ఒప్పందం తర్వాత హాస్పిటల్‌ చెయిన్‌ ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, ఆర్థిక సేవల సంస్థ రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై సోదరులు దృష్టి పెట్టారు. కానీ వీటిల్లోనూ ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు సంస్థలు విచారణ కూడా జరుపుతున్నాయి. 

ఇప్పటివరకు పరిస్థితి మెరుగవుతుందేమోనని ఆశతో, కుటుంబం కోసం ఇంతకాలం ఆగానని శివీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ‘మా కుటుంబం పరువు ప్రతిష్టలు, సంపద, వ్యక్తిగతంగా నా విశ్వసనీయత అంతా మసకబారుతున్నా.. నేను స్థాపించిన కంపెనీని బహిరంగంగా వేలం వేసే పరిస్థితి వచ్చినా కూడా  ప్రేక్షకపాత్రే వహిస్తూ ఉండిపోయాను’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇంతదాకా వచ్చిన నేపథ్యంలో సోదరుడితో వ్యాపార లావాదేవీలన్నీ తెగతెంపులు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2015లో వ్యాపార కార్యకలాపాల నుం చి తప్పుకున్న శివీందర్‌ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పంజాబ్‌లోని బియాస్‌లో స్థిరపడ్డారు. 

కోర్టు ఆదేశాల ధిక్కరణ అభియోగం కింద 3.5 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లు చెల్లించాలని మల్వీందర్‌ సింగ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి లేకుండా తమ స్థిరాస్తులు అమ్ముకోరాదని సింగ్‌ సోదరులను ఆదేశించినా మల్వీందర్‌ వాటిని ధిక్కరించారని జస్టిస్‌ రాజీవ్‌ షక్‌దర్‌ పేర్కొన్నారు. రెలిగేర్‌ హెల్త్‌కేర్‌లో 45 లక్షల షేర్లను 3.5 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లకు అమ్ముకున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలంటూ ఆదేశించారు. సింగపూర్‌లో కొన్న అపార్ట్‌మెంట్‌ ఈఎంఐలు డిఫాల్టు కాకూడదనే ఉద్దేశంతో సదరు నిధులను బ్యాంకు వాయిదాలకు కట్టేందుకు వినియోగించినట్లు మల్వీందర్‌ సింగ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ర్యాన్‌బాక్సీ డీల్‌కు సంబంధించి రూ. 3,500 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం దైచీ సాంక్యో కోర్టును ఆశ్రయించిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది.  

ఇదిలా ఉండగా సంస్థలో వ్యవస్థాగత లోటుపాట్లను ఉపయోగించుకునే మాజీ ప్రమోటర్లు సింగ్‌ సోదరులు నిధుల అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో అంతర్గతంగా వివిధ వ్యవస్థలను పటిష్టం చేసుకోవడంపై ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ దృష్టి పెట్టింది. ఇందుకోసం బయటి సంస్థను నియమించుకోనున్నట్లు 2017–18 వార్షిక నివేదికలో సంస్థ పేర్కొంది. దర్యాప్తు నివేదికలోని అంశాల ఆధారంగా నిధుల అవకతవకలపై అంతర్గతంగా విచారణ కూడా జరిపే అవకాశం ఉందని వివరించింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios