ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులే చోదకశక్తి. పరిశ్రమలు పెట్టుకునేందుకు సదుపాయాలు కల్పించడంతో పాటు లైసెన్సులు (అనుమతులు) సులువుగా లభించాలి. అప్పుడే పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

ఇవాళ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అంటూ మనమేదైతే చెప్పుకుంటున్నామో.. గతంలో ఆర్థికమంత్రిగా ఉన్న వీపీ సింగ్‌ 1986లోనే తన బడ్జెట్‌లో అందుకు నాంది పలికారు.

also read మోడిజీ...ఈ పెద్దల మాట వినండి..!.. బడ్జెట్‌పైనే వారి ఆశలు

* వీపీ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతున్నప్పటికీ. భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే ప్రభుత్వ కార్యాలయాల నుంచి కంపెనీలు అనేక లైసెన్సులు పొందాల్సి ఉండేది. 1986-87 బడ్జెట్‌లో ఇందుకు చరమగీతం పాడారు వీపీ సింగ్‌. అంతేకాదు కంపెనీల ప్రత్యక్ష పన్నులను తగ్గించారు. ఆదాయపు పన్నుపై ఉన్న మినహాయింపులను తగ్గించారు.

* చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థికంగా ఊతమందించేందుకు చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు.

* పరోక్ష పన్నుల విధానంలో వీపీ సింగ్‌ తీసుకొచ్చిన సంస్కరణల్లో ఒకటి మోడిఫైడ్‌ వాల్యూడ్‌ యాడెడ్‌ ట్యాక్స్‌ (ఎంవోడీవ్యాట్). అప్పటి వరకు పన్నుపై పన్ను వల్ల అంతిమంగా వస్తువు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ సింగ్‌ ఈ పన్ను విధానాన్ని తొలిసారి తన బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

also read Budget 2020: బడ్జెట్‌ అంటే ఏమిటీ..?ఎవరు ప్రవేశపెడతారు...బేసిక్స్‌ మీకోసం...

* పట్టణ పేదరికాన్ని తగ్గించడమే లక్ష్యంగా యువత స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీతో కూడిన బ్యాంక్‌ రుణ సదుపాయాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించారు.

* నల్లధనం అరికట్టేందుకు, స్మగ్లర్లు, పన్ను ఎగవేతదారులపై చర్యలకు ఈ బడ్జెట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు మరిన్ని అధికారాలిచ్చింది.