సజ్జాన్ జిందాల్ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సంస్థ కూడా విద్యుత్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనున్నది. ఇందుకోసం హ్యుండాయ్ మోటార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ మాజీ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాత్సవను జిందాల్ సంస్థ తన టీంలో చేర్చుకున్నది.

అంతేకాదు జేఎస్ డబ్ల్యూ ఆధ్వర్యంలోని విద్యుత్ వాహనాల పరిశ్రమ బీచ్ హెడ్‌గా రాకేశ్ శ్రీవాత్సవను నియమించుకుంది. ఆటోమోటివ్ ఆంబిషన్స్ లక్ష్యాలను చేరుకునేందుకు జేఎస్‌డబ్ల్యూ బ్లూ ప్రింట్ తయారు చేయనున్న సీనియర్ లీడర్ షిప్ టీంలో శ్రీ వాత్సవ భాగస్వామి కానున్నారు.

దేశంలోనే స్టీల్ పరిశ్రమలో రెండో స్థానంలో కొనసాగుతున్న జేఎస్ డబ్ల్యూ వచ్చే నాలుగైదేళ్లలో విద్యుత్ వాహనాలను తయారు చేసుకోవడం కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేయాలని సంకల్పిస్తోంది. 

ఇంతకుముందే విద్యుత్ కార్లను తయారు చేసే విషయమై పలు చైనా కార్ల తయారీ సంస్థలతో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సంప్రదింపులు జరిపింది. అలాగే దేశీయంగా గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలతోనూ ఉత్పాదక యూనిట్లను స్థాపించడానికి ఏర్పాట్లు చేయాలని కోరింది. 

ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థి అయిన శ్రీవాత్సవ 18 ఏళ్ల పాటు మారుతి సుజుకి, మరో ఆరున్నరేళ్ల పాటు హ్యుండాయ్ మోటార్ ఇండియా సంస్థలో పని చేశారు. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థను చిన్న పాటి కార్ల తయారీ స్పెషలిస్టుగా తీర్చిదిద్దడంలోనూ శ్రీవాత్సవ పాత్ర ఎనలేనిది.

తన ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ప్యాసింజర్స్ వెహికల్స్ సీఓఓగా పని చేసిన సెర్జియో రోచాను తన బోర్డులోకి తీసుకున్నది జేఎస్ డబ్ల్యూ.ఇంతకుముందు రోచా సెర్జియో జనరల్ మోటార్స్ ఆపరేషన్స్ అధిపతిగా ఉన్నారు. అమెరికా కార్ల తయారీ సంస్థ టాలెగావ్ మేనేజ్మెంట్‌తోనూ జేఎస్‌డబ్ల్యూ సంప్రదింపులు జరిపింది.