ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా అండర్-30 జాబితాలో తెలుగు కుర్రాళ్లకు చోటు లభించింది. ముగ్గురికి ప్లేస్ వచ్చిందని టీ-హబ్ ట్వీట్ చేసింది.

ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా అండర్-30 జాబితాలో తెలుగు కుర్రాళ్లకు చోటు లభించింది. ముగ్గురికి ప్లేస్ వచ్చిందని టీ-హబ్ ట్వీట్ చేసింది. ఫోర్బ్స్ ఇండియా 30 అండర్-30 జాబితాలో చోటు సంపాదించిన వారికి అభినందనలు తెలియజేసింది. టీ హబ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఆ ముగ్గురికి అభినందనలు తెలిపారు. దాతలు చేస్తున్న సాయం.. భాదితులకు సక్రమంగా అందుతుందా అనే అనుమానాలు తలెత్తకుండా హైదరాబాద్‌కు చెందిన అనిల్ కుమార్ రెడ్డి, సందీప్ శర్మ, సారంగ్ బోబాడే డొనేట్ కార్ట్ పేరుతో ఆన్‌లైన్ వేదిక‌ను ప్రారంభించారు. నాగ్‌పూర్ ఐఐటీలో చ‌దివిన వీరు ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి పనిచేశారు. ఆ సమయంలో పలువురు దాతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ముందుకొచ్చే దాతలు.. వారిచ్చే సామగ్రిపై ఆరా తీశారు. స్వచ్ఛందంగా పని చేసేందుకు అనేక ఎన్‌జీవోలు ఉన్నాయని గుర్తించిన వారు ఓ ఆలోచన చేశారు.

గచ్చిబౌలిలో ఆఫీస్ ఓపెన్ చేసి వెబ్‌సైట్‌ రూపొందించారు. దేశవ్యాప్తంగా 1500 స్వచ్ఛంద సంస్థలను ఇందులో చేర్చి వాటికి వార‌థిగా మారారు. దాతల సాయం కావాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకొని వారికి కావాల్సిన అవసరాన్ని వివరించాలి. అప్పుడు వారి విజ్ఞప్తిని ఎన్‌జీవోలు, దాతలు పరిశీలించి నేరుగా వెళ్లి సాయం చేస్తారు. ఇలా నాలుగేళ్లలో రూ.70 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌ సమకూర్చిపేదలకు లబ్ధి చేకూర్చారు.

కరోనా పంజా విసిరిన కాలంలో రూ.55 కోట్ల క్రౌడ్‌ ఫండింగ్‌తో అనేక వర్గాలకు సాయం చేశారు. డొనేట్‌ కార్ట్‌ వ్యవస్థాపకుల కృషిని గుర్తించిన నాస్కామ్‌ 2018లో ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపిక చేయగా.. మంత్రి కేటీఆర్‌ వారికి అందజేశారు. ఇప్పటి వరకు పది లక్షల మంది దాతలు 1,000 ఎన్జీవోలకు రూ.150 కోట్లకు పైగా విరాళాలు అందించారు. ఇలా వారు చేసిన మంచిపనితో.. ఫోర్బ్స్‌ అండర్ 30 జాబితాలో చేరారు.