న్యూఢిల్లీ: తమ వేతనాలు పెరుగుతాయని సంబురపడిన సగటు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులను ఆర్థిక మాంద్యం కాటేసింది. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు దెబ్బ తినడంతో ఆయా సంస్థలు గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో జీతాల పెంపును పక్కన పెట్టేశాయి మెజారిటీ సంస్థలు. ముఖ్యంగా ప్రైవేట్ రంగ కంపెనీలు.. వేతనాల విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. దీంతో గడిచిన పదేళ్లలోనే నిరుడు ఉద్యోగులకు అత్యంత గడ్డు సంవత్సరంగా మిగిలిపోయింది. 

2009-10 తర్వాత మళ్లీ 2018-19 ఆర్థిక సంవత్సరమే వేతనాల్లో వృద్ధి దారుణంగా నమోదైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అధ్యయన నివేదిక తెలిపింది. 

వ్యాపారం మందగించిన నేపథ్యంలో వేల మందికి ఉద్యోగాలు దూరం అవుతుంటే, లక్షల మంది జీతాల్లో వృద్ధి కానరావడం లేదు. 2017-18 లో వచ్చిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్).. దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతంగా ఉన్నట్లు గుర్తించింది. ఇది ఆల్‌టైమ్ హై కావడం గమనార్హం.

ఇక స్త్రీ, పురుషుల ప్రకారం 1977-78 నుంచి పురుష ఉద్యోగుల్లో, 1983 నుంచి స్త్రీ ఉద్యోగుల్లో గరిష్ఠం. మొత్తం నిరుద్యోగుల సంఖ్య 2.85 కోట్లుగా ఉండగా, 2011-12తో పోల్చితే ఇది రెట్టింపు అవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. నాడు 1.8 కోట్లుగానే ఉన్నారు మరి. కేవలం ఆరేండ్లలో 1.8 కోట్ల మంది నిరుద్యోగులు దేశంలో పెరిగిపోయారు. మరోవైపు నియామకాలూ దారుణంగా పడిపోయాయి. బ్యాంకింగ్, బీమా, ఆటో, లాజిస్టిక్స్, మౌలిక వసతుల రంగాల్లో కొత్త కొలువులు చాలావరకు క్షీణించాయని కేర్ రేటింగ్స్ తెలిపింది.

మార్కెట్‌లో నెలకొన్న నిస్తేజకర పరిస్థితే.. ఉద్యోగుల వేతనాల పెంపునకు ప్రధాన అవరోధంగా నిలిచిందని సీఎంఐఈ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం 4,953 సంస్థల ఆర్థిక స్థితిగతులను సీఎంఐఈ పరిశీలించింది. ఈ సంస్థల అమ్మకాలు వరుసగా నాలుగేండ్లు పడిపోయినట్లు గుర్తించింది. 2012-13నుంచి ఈ క్షీణత ప్రారంభమైంది. అయితే 2016-17లో అమ్మకాలు కాస్త పెరుగగా, 2017-18లోనూ ఆ ఉత్సాహం కొనసాగింది. కానీ ఆ తర్వాత మళ్లీ మందగమనం తలెత్తగా, అమ్మకాల్లో వృద్ధి తాత్కాలికమేనని తేలిపోయింది. ఈ క్రమంలోనే 2018-19లో మొత్తం అమ్మకాల ఆదాయంలో వేతనాల వాటా శాతం ఏడేండ్లలో తొలిసారి పతనాన్ని చవిచూసింది.