న్యూఢిల్లీ: కరోన మహమ్మారి కల్పించిన సంక్షోభం నుంచి కోలుకోవడానికి దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలన్నీ తమకు గ్రామీణ మార్కెట్లే ఆలంబనగా నిలుస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కొద్ది వారాలుగా గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు గణనీయంగా పెరగడమే వారి ఆశలకు కారణం.

ప్రధానంగా సెమీ అర్బ న్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఆహార వస్తువులతో పాటుగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, పారిశుధ్యం, రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేసే ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఐటీసీ, గోద్రెజ్‌, డాబర్‌, ఇమామీ, మారి కో గణాంకాలు నిరూపిస్తున్నాయి.

ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీలన్నీ ఈ శ్రేణుల్లోకి వచ్చే ఉత్పత్తుల వాల్యూ ప్యాక్‌లు మార్కెట్లోకి తేవడంతోపాటు గ్రామీణ, సెమీ అర్బన్‌ నెట్‌వర్క్‌‌ను విస్తరించుకునే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయిలోనే ఉండే సూచనలు కనిపిస్తుండటం కూడా వారి ఆశలకు నీరు పోసింది.

also read ముకేశ్ అంబానీ మనసులో ఏముంది? వరుస పెట్టుబడులపై గుడ్ న్యూస్ చెబుతారా? ...

ప్రస్తుత జోరు చూస్తుంటే గ్రామీణ మార్కెట్లలో రెండంకెల వృద్ధి ఏర్పడవచ్చని ఇమామీ ఆశలు పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్‌ఫీస్ట్‌ బిస్కట్లు, బింగో శ్రేణి స్నాక్‌లు, ఇప్పీ నూడుల్స్‌ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఐటీసీ చెబుతోంది.

గ్రామీణ మార్కెట్లపై దృష్టితో ఇటీవల ఐటీసీ 50 పైసల ధరతో హ్యాండ్‌ శానిటైజర్‌ చిన్న ప్యాక్‌లను మార్కెట్లోకి తెచ్చింది. ప్రస్తుతం 58 వేల గ్రామాల్లో తమ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, మొత్తం అమ్మకాల్లో గ్రామీణ వాటా 31 శాతం ఉన్నదని ఆ కంపెనీ చెబుతోంది.

గ్రామీణ మార్కెట్లలో విస్తరణకు ఇమామీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. 60 వేల గ్రామాలకు తమ నెట్‌వర్క్‌ విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ప్రభుత్వం ప్రకటించిన పలు కార్యక్రమాలు, మంచి రుతుపవనాలు వ్యవసాయాదాయాలు పెరిగేందుకు దోహదపడతాయని భావిస్తోంది.