Asianet News TeluguAsianet News Telugu

క్యాడ్ ఎఫెక్ట్: విమానయానం సహా కస్టమర్ల జేబుకు ‘సుంకం’ చిల్లు

పేరుకు కరంట్ ఖాతా లోటు (క్యాడ్) తగ్గింపునకు విదేశీ వస్తువుల దిగుమతిపై సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం.. ఆ జాబితాలో బంగారాన్ని చేర్చలేదు. ఫలితంగా పండుగల సీజన్‌లో సామాన్యుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. 

Flying, ACs, Refrigerators To Cost More After Centre Hikes Import Duty
Author
Mumbai, First Published Sep 27, 2018, 8:24 AM IST

అంతా ఊహించినట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతున్న కరెంటు ఖాతా లోటును (సీఏడీ) కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టనున్నది. కేంద్ర సర్కార్ బుధవారం ఎయిర్ కండీషనర్లు సహా 19 వస్తువులపై దిగుమతి సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నది. కరంట్ ఖాతా లోటు పెరుగుదలలో కీలకమైన బంగారాన్ని దిగుమతి సుంకం నుంచి మినహాయించడం గమనార్హం. గత జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కరంట్ ఖాతా లోటు జీడీపీలో 2.4 శాతం పెరిగింది.

కొంతకాలంగా దేశీయంగా దిగుమతులు పెరిగిపోతుండడం, ఎగుమతుల్లో తరుగుదల వల్ల దేశంలో కరెంటు ఖాతా లోటు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు రూపాయి మారకపు విలువ తగ్గుతుండటం కూడా సర్కారు ఆందోళనకు ఊతం ఇచ్చింది. దీంతో దిగుమతులను తగ్గించేందుకు సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంలో భాగంగా 19 వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాన్ని సర్కార్ పెంచనుంది. 

పండుగల సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం సామాన్యుడిని కాస్త కలవర పెట్టింది. సుంకాలు పెరగడంతో ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, పాదరక్షలతో పాటు పలు వస్తువులు 5 - 20 శాతం మేర ప్రియం కానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూపాయి మారకపు విలువ దాదాపు 13% పైగా తగ్గిన నేపథ్యంలో ఇలాంటి ఆలోచన చేయాల్సి వచ్చిందని సర్కార్ వివరణ ఇచ్చుకున్నది. 

ప్రభుత్వం సుంకాలను పెంచిన వస్తువుల మొత్తం దిగుమతుల విలువ దాదాపు రూ. 86,000 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ తెలిపింది. దేశంలో సంపన్న, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఎక్కువగా తమ విలాసాల కోసం కొనుగోలు చేస్తున్న దాదాపు 19 ప్రధాన వస్తువులను గుర్తించిన సర్కార్ మొదటి దశగా వీటిపై సుంకాన్ని పెంచింది. దీనివల్ల దిగుమతులు తగ్గి దేశీయ వస్తువుల వినిమయం పెరుగుతోందన్నది మోదీ సర్కార్ అలోచన. 

ఫలితంగా దిగుమతుల రూపంలో ఎక్కువగా సరిహద్దులు దాటుతున్న డాలర్ల వలసను కట్టడి చేయాలన్నది సర్కారు ప్రధాన ఆలోచన. అయితే తొలి దశలో కొన్ని వస్తువులపై సుంకాన్ని పెంచిన సర్కార్ రానున్న రోజుల్లో మరిన్ని వస్తువులపై దీనిని వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది.

ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మెషిన్లు (10 కిలోల లోపు సామర్థ్యం కలిగిన), ఏసీ మరియు రిఫ్రిజిరేటర్ల కంప్రెసర్లు, స్పీకర్లు, పాదరక్షలు, రేడియల్‌ కార్‌ టైర్లు, పారిశ్రామికేతర వజ్రాలు, పరిశోధనాలయాల్లో అభివృద్ధి చేసిన డైమండ్లు, ముక్కలు చేసి సానపట్టిన రంగు రాళ్లు, అభరణాలు, జ్యువెల్లరీ తయారీకి ఉపయోగించే వాణిజ్య సంబంధిత ఇతర మెటల్స్‌, కంసాలీలు ఉపయోగించే పరికరాలు, స్నానపు గదుల్లో ఫిక్చ్సర్లు, షవర్లు, సింకులు ఉన్నాయి.

ఇంకా వాష్‌ బేసిన్‌లు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఆర్టికల్స్‌, ప్యాకింగ్‌ బాక్స్‌లు, కేసులు, కంటైనర్లు, సీసాలు, ఇన్సూలేటెడ్‌ వేర్‌లు, టేబుల్‌ వేర్‌, వంటగదిలో వాడే ఉపకరణాలు, ఆఫిస్‌ స్టేషనరీ, ఫర్నీచర్‌ ఫిట్టింగ్‌లు, గాజులు, అలంకరణ షీట్లు, పరుపులు, ట్రంకు పెట్టెలు, సూట్‌ కేసులు, ఎగ్జిక్యూటివ్‌ కేసులు, బ్రిఫ్‌ కేసులు, బ్యాగులు, ట్రావెల్‌ బ్యాగ్‌లు, విమాన ఇంధనాలపై కస్టమ్స్‌ సుంకం పెరగనుంది.

మరోవైపు ఎలక్ట్రానిక్‌ వస్తువులు, విమాన ఇంధన ధరలపై సుంకాన్ని పెంచడం ఆయా రంగాలకు షాక్‌ ఇచ్చింది.  ఇప్పటికే ఇంధన ధరల  పెరుగుదలతో కుదేలవుతున్న విమానయాన పరిశ్రమ ఉపయోగించే టర్బైన్‌ ఆయిల్‌ దిగుమతులపై తొలిసారి 5శాతం సుంకాన్ని విధించింది. అలాగే రానున్న ఫెస్టివ్‌ సీజన్‌ నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఏసీలు, ఫ్రీజ్‌, వాషిగ్‌మెషిన్లపై  దిగుమతి సుంకం పెంపు సాధారణ కొనుగోలు దారులకు చేదువార్తే.

ఆయా వస్తువులపై పెరిగే సుంకం ఇలా: 
* మెటల్‌ జ్యుయల్లరీ, సెమీ ప్రాసెస్డ్‌ డైమండ్స్‌, కొన్ని రకాల విలువైన రాళ్లపై 5% నుంచి 7.5శాతానికి  పెంపు.
* ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషిన్లు, టీవీలపై 10% నుంచి  20% పెంపు
* ప్లాస్టిక్‌ వస్తువులపై10 నుంచి 15శాతానికి పెంపు
* సూట్‌కేసులపై 10 నుంచి 15శాతానికి పెంపు
* ఏవియేషన్‌ టర్బైన్‌ ఆయిల్‌పై 5శాతం
* రేడియల్‌ కారు టైర్లపై 10 నుంచి 15శాతానికి
* ఫుట్‌వేర్‌పై 20 నుం 25 శాతానికి పెంపు
* కిచెన్‌వేర్‌పై 10నుంచి 15శాతానికి పెంపు
* షవర్ బాత్‌, సింక్లు, వాష్ బేసిన్, స్పీకర్లపై  10% నుండి 15% పెంపు

Follow Us:
Download App:
  • android
  • ios