బయటకు చెప్పినా, చెప్పకపోయినా ఉర్జిత్‌ పటేల్‌ ఆర్బీఐ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయడానికి కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వ ఒత్తిడే కారణం అని అంతర్జాతీయ పరపతి రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ రేటింగ్స్‌ తెలిపింది. ఆర్బీఐ విధానాల్లో ప్రాధాన్యంపై ప్రభుత్వం పెత్తనం చేసే ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేసింది. 

ఆర్‌బీఐపై ప్రభుత్వ పెత్తనం పెరగడం ఏ మాత్రం మంచిది కాదని తెలిపింది. అదే జరిగితే బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయి(ఎన్‌పీఏ)ల సమస్య పరిష్కారం కోసం ఆర్బీఐ చేపట్టిన చర్యలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆర్బీఐ చర్యలు అనుకున్నట్టు కొనసాగితే, దీర్ఘ కాలంలో భారత బ్యాంకింగ్‌ రంగం ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని తెలిపింది.

పటేల్‌ నిష్క్రమణ ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించాలంటే.. కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆధ్వర్యంలోని ఆర్బీఐ విధానాల నుంచి సంకేతాలు అందాల్సి ఉందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్‌ రంగ పరిరక్షణ కోసం, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ఆర్బీఐ చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వ సూచనలు ఉండొచ్చని ఫిచ్‌ పేర్కొంటోంది. 

‘ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ బకాయిలు, ఎన్‌బీఎఫ్‌సీ రంగ సమస్యలతో ద్రవ్యలభ్యత తగ్గింది. ఈ నేపథ్యంలో రుణ లభ్యత పెరగడం కోసం కొన్ని బ్యాంకులకు సత్వర దిద్దుబాటు ప్రణాళిక(పీసీఏ) నిబంధనలను సడలించాలని ప్రభుత్వం చేసిన యత్నాలు విఫలమయ్యాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు సత్వర ద్రవ్యలభ్యత అందించడానికీ విఫలయత్నమే చేసింద’ని ఫిచ్‌ పేర్కొంది.