దేశీయ విమాన యాన సంస్థలు ఆర్థిక కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ సుడిగుండంలో కొట్టుకొని ఇప్పటికే అర్ధంతరంగా మూతపడ్డ కింగ్‌ఫిషర్, జెట్ ఎయిర్‌వేస్ బాటలోనే మరో సంస్థ నడుస్తున్నదా..! అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి.
ప్రభుత్వరంగ హెలిక్యాప్టర్ల నిర్వహణ సంస్థ పవన్ హన్స్ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు తెలుస్తున్నది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేక ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించలేకపోతున్నామని ఈ నెల 25వ తేదీన ఉద్యోగులకు పంపిన సర్క్యులర్‌లో పేర్కొంది. తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు తప్పవని పవన్ హన్స్ ఒక ప్రకటనలో హెచ్చరించింది.

గత ఆర్థిక సంవత్సరానికి పవన్ హన్స్ సంస్థ రూ.89 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కంపెనీకి వచ్చే ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటున్నదని, ముఖ్యంగా ఉద్యోగుల కోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి రావడంతో సంస్థ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం పడుతున్నదని ఆ వర్గాలు తెలిపాయి. 

సంస్థకు కస్టమర్ల నుంచి రావాల్సిన రూ.230 కోట్ల బకాయిల్లో 60% వరకు వసూలైనా ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కాగా, అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలను చేశామని, ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఉద్యోగులు కలిసికట్టుగా కృషి చేయాలని యాజమాన్యం సూచించింది. 

పవన్ హన్స్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అమానుషం అని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానించాయి. జీతభత్యాలను పెంచుతారనుకుంటే.. ఉన్న వాటిని చెల్లించలేమని చెప్పడం ఆందోళన కలిగిస్తున్నదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం 46 హెలిక్యాప్టర్లతో పవన్ హన్స్ సేవలు అందిస్తున్నది.