మందగిస్తున్న దేశ ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్రం ఎప్పుడూ లేని భారీగా ఆలోచిస్తోంది. దేశ ఆర్ధిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చడానికి 2024-25 నాటికి మౌలిక వసతుల రంగంలోకి ఏకంగా రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చేయాలని భావిస్తోన్నట్లు శనివారం కేంద్ర ఆర్ధిక శాఖ ఓ ప్రకటన చేసింది. 

ఈ మొత్తం పెట్టుబడుల కల్పనకు రోడ్‌మ్యాప్‌ రూపొందించడానికి ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీ రూ.100 కోట్ల పైబడిన గ్రీన్‌ ఫీల్డ్‌, బ్రౌన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నది.

ఈ టాస్క్‌ఫోర్స్‌లో పలు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఇతర సీనియర్‌ అధికారులు, నీతి అయోగ్‌ సీఈఓ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. ఇది 2019-20 నుంచే ఆర్ధికంగా, విత్తపరంగా ఫలించే ప్రాజెక్టులను గుర్తించనున్నది. 

2020-21 ఆర్ధిక సంవత్సరం నుంచి 2014-25 ఆర్ధిక సంవత్సరం వరకు ఐదేళ్ల పాటు వచ్చే ప్రాజెక్టులకు అవకాశాలను గర్తించి జాబితాను రూపొంచనున్నది. ఈ టాస్క్‌ ఫోర్స్‌ 2019-20కి ప్రాజెక్టులపై నివేదికను వచ్చే నెల అక్టోబర్‌ 31 కల్లా విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందించనుంది. ఈ మేరకు నివేదికను 2019 డిసెంబర్‌ ముగింపు నాటికి ఇవ్వనుంది.

2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చే లక్ష్యంలో భాగంగా మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్ల (1.4 ట్రిలియన్‌ డాలర్లు) వ్యయం చేయాలని కేంద్రం నిర్దేశించుకుందని ఆర్ధిక శాఖ తెలిపింది. గడిచిన దశాబ్దం (2008-17) కాలంలో మౌలిక వసతుల రంగ వసతులపై 1.1 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. 

మౌలిక వసతులు కల్పించకుండా వృద్ధి రేటును ఆశించలేమని ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. 

సామాజిక, ఆర్ధిక మౌలిక వసతులపై ఈ పెట్టుబడులు ఉంటాయని న్నారు. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణలో ప్రతి శాఖ, విభాగం బాధ్యులుగా ఉంటాయని ఆర్ధిక శాఖ పేర్కొంది. గడువు సమయంలో, అంచనా వేసిన వ్యయంలో పూర్తి చేయడంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.