న్యూఢిల్లీ: ఆర్బీఐ నూతన గవర్నర్‌గా కేంద్ర ఆర్థికశాఖ వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్ వంటి అనుభవజ్ణుడ్ని నియమించి కేంద్రం సరైన నిర్ణయం తీసుకున్నది ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ పేర్కొంది. శక్తికాంత దాస్ నియామకానికి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంఘంలో సభ్యుడిగా ఉన్న శక్తికాంత దాస్ మంచి ఎకనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని, ఆర్బీఐని సరైన దారిలో నడుపగల సామర్థ్యం ఉన్నదని పేర్కొంది. ప్రస్తుత కీలక తరుణంలో ఆర్బీఐతోపాటు భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలరని తెలిపింది. జీ-20 సదస్సులో ప్రతినిధిగానూ వ్యవహరించిన శక్తికాంత దాస్ అంతర్జాతీయ పరిణామాలపై అవగాహన కలిగి ఉన్నారని ఫిక్కీ అధ్యక్షుడు రాకేశ్ షా పేర్కొన్నారు. 

తక్షణం ద్రవ్య లభ్యతను పెంచాలన్న సీఐఐ

ఆర్బీఐ నూతన గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్.. వ్యవస్థలోని ద్రవ్య కొరత సమస్యను ముందుగా పరిష్కరించాలని పారిశ్రామిక, వ్యాపార సంఘం సీఐఐ కోరింది. ఈ దిశగా చర్యలుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో అనుభవమున్న ఆర్థిక నిపుణుడిని ఎంచుకున్నదని.. మదుపరులు, పరిశ్రమలో దాస్ విశ్వాసాన్ని నింపగలరన్న ధీమాను సీఐఐ అధ్యక్షుడు రాకేశ్ భారతీ మిట్టల్ వ్యక్తం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఆర్థిక చేయూత ఇవ్వాలని ఆయన సూచించారు.  

స్వయంప్రతిపత్తి.. విశ్వసనీయత ప్రధాన సవాళ్లు

ఆర్బీఐకి కొత్తగా వచ్చే గవర్నర్‌కు ప్రధానంగా రెండు సవాళ్లు ఎదురవుతాయని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విశ్లేషించారు. స్వయంప్రతిపత్తి, విశ్వసనీయతలే ఆ రెండని పేర్కొన్న ఆయన వీటిని ఆర్బీఐలో తిరిగి నెలకొల్పడం అంత సులువేమీ కాదని అభిప్రాయపడ్డారు. కొత్త సారథికి ఇదో పరీక్షగానే అభివర్ణించారు. ఇక ఊర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో తమ ఎజెండాను ఎలా ముందుకు తీసుకెళ్లలా? అన్నదానిపైనా ప్రభుత్వం ఆలోచనలో పడవచ్చని సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ అన్నారు.