న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి స్రుష్టించిన విలయంతో పారిశ్రామిక, వాణిజ్య సంఘాలకు ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. తాజాగా కరోనా దెబ్బకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 4.5 శాతానికి పతనం అవుతుందని ఫిక్కీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతం నమోదవుతుందని ఫిక్కీ అంచనా వేసింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ చతికిల పడడంతో వృద్ధి రేటు అంచనాల్ని మైనస్‌ స్థాయికి కుదించాల్సి వచ్చిందని పేర్కొంది.

పరిస్థితులు మరింత విషమిస్తే వృద్ధి రేటు మైనస్‌ 6.4 శాతానికి కూడా పడిపోయే ప్రమాదం ఉందని ఫిక్కీ ఆందోళన  వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి వృద్ధి రేటు పుంజుకున్నా అది 1.5 శాతానికి మించదని స్పష్టం చేసింది. 

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో జీడీపీ వృద్ధి రేటు ఘోరంగా పడిపోయినట్టు ఫిక్కీ పేర్కొంది. ఈ తరుగుదల ఏకంగా మైనస్‌ 14.2 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో పారిశ్రామిక, సేవల రంగాలు పూర్తిగా నిలిచిపోయాయని ఫిక్కీ గుర్తు చేసింది.

also read పట్టణాలతో పోలిస్తే పల్లెలే బెటర్: రూరల్ నెట్‌వర్క్‌ విస్తరణపై దృష్టి ...

గత నెల నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా పారిశ్రమిక, సేవా రంగాలు ఇంకా కోలుకోలేదని ఫిక్కీ తెలిపింది. ఎఫ్‌ఎంసీజీ, వినియోగ వస్తువుల కంపెనీలు మినహా మిగిలిన రంగాల్లోని కంపెనీలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించలేదని తెలిపింది. సరఫరా సమస్యలు కొంత సద్దుమణిగినప్పటికీ ‘డిమాండ్‌’ కొరత సమస్య ఇంకా అలానే ఉన్నదని గుర్తు చేసింది. 

పారిశ్రామిక, సేవల రంగాలు కుప్పకూలినా వరుణుడి కటాక్షంతో వ్యవసాయం రంగం ఒక్కటే ప్రస్తుతం ఆశాజనకంగా కనిపిస్తోందని ఫిక్కీ పేర్కొంది. దీంతో గ్రామీణ డిమాండ్‌ కొద్దిగా ఆర్థిక వ్యవస్థను ఆదుకుంటుందని అంచనా వేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పెంచడం ఇందుకు దోహదం చేయనున్నదని తెలిపింది. 

దేశంలో వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని ఫిక్కీ అంచనా వేస్తోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెపో రేటు 2.5% తగ్గించినా, అందులో ఎక్కువ భాగం ఇంకా రుణగ్రహీతలకు చేరలేదని ఆర్బీఐ భావిస్తోందని పేర్కొంది. దీంతో మున్ముందు రెపో రేటు మరింత తగ్గించే అవకాశం ఉందని ఫిక్కీ అంటోంది.