Asianet News TeluguAsianet News Telugu

యెస్ బ్యాంక్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్: పెట్టుబడుల వరద

యెస్ బ్యాంకులోకి పెట్టుబడుల వరద పారుతోంది. ఇప్పటికే రూ.10,600 కోట్ల పెట్టుబడులు పెడుతున్న వివిధ బ్యాంకులు ప్రకటించాయి. తాజాగా బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంకులు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపాయి.

Federal Bank to invest Rs 300 cr in Yes Bank at Rs 10 per equity share
Author
Mumbai, First Published Mar 15, 2020, 1:10 PM IST

ముంబై: పెట్టుబడుల సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంకును గట్టెక్కించేందుకు పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ఆర్బీఐ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికను కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదించింది.

అంతేకాదు బ్యాంకుకు అందించే అధీకృత పెట్టుబడిని రూ. 6200 కోట్లకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ‘ఎస్బీఐ’ 49 శాతం ఈక్విటీ కొనుగోలు ద్వారా రూ.7250  కోట్ల నిధులను యస్‌ బ్యాంకుకు నిధులు అందుబాటులోకి తేనున్నది.

దీంతో యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు  దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు పెట్టుబడులను ప్రకటించగా శనివారం బంధన్‌ బ్యాంక్‌ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది.

రూ.2 ముఖ విలువ ఉన్న షేర్ (రూ.8 ప్రీమియంతో) రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని బంధన్ బ్యాంక్ పేర్కొంది. నగదు రూపేణా ఈ లావాదేవీ జరుగుతుంది. 

తాజాగా ఫెడరల్ బ్యాంకు కూడా యస్ బ్యాంకులో రూ .300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. 30 కోట్ల ఈక్విటీ షేర్లను ఈక్విటీ షేరుకు రూ. 10 చొప్పున కొనుగోలు చేసి రూ.300 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.

ఇప్పటివరకూ యస్‌ బ్యాంకులో ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1000 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.1,000 కోట్లు, యాక్సిస్‌ రూ.600 కోట్లు, కోటక్‌ మహీంద్రా రూ.500 కోట్లు, బంధన్‌ బ్యాంకు రూ.300 కోట్లు, ఫెడరల్‌ బ్యాంకు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 

ఇక యస్‌ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయడంతో బ్యాంకు, ఖాతాదారులు నగదు విత్ డ్రాయల్‌పై తాత్కాలిక నిషేధాన్ని మార్చి 18వ తేదీన ఎత్తివేయనున్న సంగతి తెలిసిందే.

సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న యెస్​ బ్యాంకు డిసెంబర్ త్రైమాసికంలో రూ.18,564 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతకు ముందు సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.629 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇదే బ్యాంకు రూ.1000 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 

యెస్​ బ్యాంకు మొత్తం రుణాల్లో మొండి బాకీల వాటా 18.87 శాతానికి పెరిగింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 7.39 శాతంగా ఉంది. మరోవైపు క్యాపిటల్ బఫర్లూ క్షీణించాయి. 

డిసెంబర్ త్రైమాసికం నాటికి యెస్​ బ్యాంకు మూలధన సమృద్ధి నిష్పత్తి (క్యాపిటల్ ఆడిక్వసీ రేషియో) 4.2 శాతానికి పడి పోయింది. ఇది సెప్టెంబర్ త్రైమాసికం చివర్లో నివేదించిన 16.3 శాతంలో దాదాపు నాలుగో వంతు. రెగ్యులేటరీ అవసరాల కంటే ఇది చాలా తక్కువ.

Follow Us:
Download App:
  • android
  • ios