దేశీయ స్టాక్ మార్కెట్లకు ‘అమెరికా’ ఫెడ్ రిజర్వు భయం పట్టుకున్నది. భవిష్యత్‌లో మరింత వడ్డీరేట్ల పెంపునకు సంకేతాలివ్వడంతో విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోతారన్న భయాలు పెరిగాయి. సెప్టెంబర్ డెరివేటీవ్ కాంట్రాక్టుల గడువు ముగియడంతో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

ముంబై/న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లలో వివిధ రంగాల సూచీలు వరుసగా రెండో రోజూ డీలాపడ్డాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వు బ్యాంక్ 2 నుంచి 2.25 శాతం వడ్డీ రేట్లు పెంచింది. 2015 నుంచి ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడం ఇది ఎనిమిదో సారి. 2008 అక్టోబర్ నుంచి ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు అత్యధిక స్థాయికి చేరడం ఇదే ప్రథమం. భవిష్యత్‌లో మరిన్ని రేట్ల పెంపునకు సంకేతాలివ్వడంతో డాలర్ విలువ బలోపేతం కావడంతోపాటు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముడిచమురు ధరలు పెరగడం, సెప్టెంబర్ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగిసిపోవడం సైతం స్టాక్స్ అమ్మకాల వత్తిడికి కారణమయ్యాయి. 

ఫలితంగా దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ) కీలకమైన 11 వేల పాయింట్ల దిగువకు చేరింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా షేర్లు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.
సెన్సెక్స్‌ ఉదయం 36,691.93 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అదే జోరు కొనసాగిస్తూ అంతర్గత ట్రేడింగ్‌లో 36,711.62 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఎంపిక చేసిన షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ రావడం ఇందుకు తోడ్పడింది. మధ్యాహ్నం తర్వాత చివరి 30 నిమిషాల ముందు డీలాపడిన సూచీ.. నష్టాల్లోకి జారుకున్నది. 

ఒకానొకదశలో 36,238.23 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరుకుని చివరకు 218.10 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 36,324.17 దగ్గర స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 76.25 పాయింట్ల నష్టంతో 10,977.55 వద్ద ముగిసింది. నిఫ్టీ అంతర్గత ట్రేడింగ్‌లో ఈ సూచీ 10,953.35- 11,089.45 పాయింట్ల మధ్య కదలాడింది.

బీఎస్ఈ సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టాల బాట పట్టాయి. మారుతి సుజుకి 3.68%, టాటా మోటార్స్‌ 3.32%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.79%, ఓఎన్‌జీసీ 2.49%, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 2.16%, హెచ్‌డీఎఫ్‌సీ 2.07%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.87%, ఎల్‌ అండ్‌ టీ 1.80%, ఎం అండ్‌ ఎం 1.80%, సన్‌ఫార్మా 1.59%, భారతి ఎయిర్‌టెల్‌ 1.33% చొప్పున డీలాపడ్డాయి. టీసీఎస్‌ 2.16%, కోల్‌ ఇండియా 1.39%, పవర్‌గ్రిడ్‌ 0.93%, ఇన్ఫీ 0.88% రాణించిన షేర్లలో ఉన్నాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్థి అత్యధికంగా 2.79 శాతం కోల్పోయింది. యంత్ర పరికరాలు, ఫైనాన్స్‌, వాహన, మౌలిక, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్‌, మన్నికైన వినిమయ వస్తువులు, టెలికాం షేర్లు అదే బాటలో నడిచాయి.

సీఈఓ రాణా కపూర్‌ పదవీకాలంపై అనిశ్చితి నేపథ్యంలో యెస్‌ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అంతర్గత ట్రేడింగ్‌లో 9.68 శాతం కుప్పకూలిన షేరు.. చివరకు 9.14 శాతం నష్టంతో రూ.203.20 వద్ద ముగిసింది. ఇక దిగుమతి సుంకాల పెంపుతో వోల్టాస్‌ 6.19%, బ్లూస్టార్‌ 5.26%, హావెల్స్‌ 5.20%, వర్ల్‌ఫూల్‌ 3.17% చొప్పున నష్టాలు నమోదు చేశాయి.

తన విద్యుత్‌ వ్యాపార విభాగం దేశీయ మార్కెట్లో రూ.1400 కోట్ల ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. ఇందులో భాగంగా ఎన్‌టీపీసీకి చెందిన మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్‌ సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్, ఒడిశాలోని దర్లిపలి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

కోర్‌ కెమికల్స్‌(ముంబై), కీ ఆర్గానిక్స్‌లను తనలో విలీనం చేసుకోడానికి బోర్డు అనుమతులు ఇచ్చినట్లు ఇండో అమైన్స్‌ తెలిపింది. ఎటువంటి నగదు లావాదేవీకి ఆస్కారం లేని ఈ విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) అనుమతి లభించాల్సి ఉంది. జేఎమ్‌ ఫైనాన్షియల్‌ క్రెడిట్‌ సొల్యూషన్స్‌లోకి రూ.875 కోట్ల పెట్టుబడులు పెట్టాలని జేఎమ్‌ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు నిర్ణయించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎండోమెంట్‌ ఫండ్‌, జీఐసీ ఆఫ్‌ సింగపూర్‌ కూడా ఇందులో పాలుపంచుకోనున్నాయి.

ఇంజినీరింగ్‌, నిర్మాణ కంపెనీ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ శుక్రవారం స్టాక్‌ మార్కెట్లలో నమోదు కానున్నది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో షేర్ల జారీ ద్వారా కెనరా బ్యాంక్‌ రూ.6000 కోట్లను సమీకరించనుంది. మరోవైపు ప్రభుత్వం నుంచి రూ.5431 కోట్ల నిధులను సమీకరించే ప్రతిపాదనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) బోర్డు అంగీకరించింది.

తన అనుబంధ సంస్థ నీల్‌కమల్‌ రియల్టర్స్‌ టవర్‌ (ఎన్‌ఆర్టీపీఎల్‌)లో మొత్తం వాటాను కొనుగోలు చేసినట్లు డీబీ రియాల్టీ పేర్కొంది. ఒప్పందం విలువ ఎంత అనేది కంపెనీ బయటకు తెలుపలేదు. ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు మూడో రోజున 97 శాతం స్పందన లభించింది. రూ.1734 కోట్ల సమీకరణ కోసం 1,47,85,027 షేర్లకు బిడ్‌లను ఆహ్వానించగా.. 1,43,96,076 షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి.