పంట రుణాల మాఫీపై జరుగుతున్న చర్చలో ఆసియా అభివ్రుద్ధి బ్యాంక్ (ఏడీబీ) భారత్ డైరెక్టర్ కెనిచీ యొకొయమా చేరారు. దేశ వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి పంట రుణాల మాఫీ అమలు చేయడం ఆర్థిక రంగ ప్రమాణాలకు వ్యతిరేకం అని కెనిచీ యొకొయమా పేర్కొన్నారు.

పంట రుణాలను మాఫీ చేయడానికి బదులు నిర్దేశిత లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల (డీబీటీ)ను అమలు చేయాలని ఆసియా అభివ్రుద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఇండియా డైరెక్టర్ కెనిచీ యుకొయమా వ్యాఖ్యానించారు.

తద్వారా మధ్య దళారీల బెడదను తగ్గించవచ్చునని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల అమలులో ‘నగదు బదిలీ పథకం’ అమలు చేయడానికి ఆధార్ కార్డుల వినియోగం ప్రశంసనీయం అని పేర్కొన్నారు.

అయితే వ్యవసాయ రంగ సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ఆసియా అభివ్రుద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఇండియా డైరెక్టర్ కెనిచీ యుకొయమా అంగీకరించారు. కానీ రుణ మాఫీ ఆర్థిక ప్రమాణాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభ నివారణకు ఇది సమర్థవంతం కాదన్నారు. 

ఈ వారం ప్రారంభంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ పంట రుణాల మాఫీ పథకాలు క్రెడిట్ కల్చర్, రుణ గ్రహీతల వైఖరిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు పంట రుణ మాఫీ పథకాలను అమలు చేశామని ప్రకటించిన సంగతిని కూడా శక్తికాంత దాస్ గుర్తు చేశారు. 

పంట రుణాలను మాఫీ చేయడం వల్ల సంబంధిత రాష్ట్రాలకు ద్రవ్య లభ్యత సమస్యలు తలెత్తుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలు ప్రకటించిన పంట రుణాల మాఫీ పథకం అమలు చేయడం వల్ల రూ.1.47 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.