వ్యవసాయ రుణాల మాఫీ పథకం ప్రజాకర్షక పథకం అని, ఓటు బ్యాంకు రాజకీయంలో భాగమనే వారి వాదనపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంట రుణాల మాఫీ పథకం సమర్థనీయమేనని పేర్కొన్నారు. 

రుణమాఫీతో రైతులను కొంతైనా ఆదుకోవచ్చు
కొంత మంది దీన్ని ఓట్లు దండుకునే ప్రజాకర్షక పథకంగా అభివర్ణించడపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని కొంతలో కొంతైనా ఆదుకునేందుకు ఈ ‘రుణ మాఫీ’లు ఉపయోగపడతాయని అమర్త్యసేన్ పేర్కొన్నారు. 

అప్పుల ఊబిలో రైతాంగానికి ప్రత్యేక సమస్యలు
ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన అమర్త్యసేన్‌ ఒక వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ .. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతాంగం కొన్ని ప్రత్యేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. ఇందులో కొన్ని సమస్యలకు రైతులు కారణమైనా, వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరం ఉందన్నారు. 

సన్న, మధ్యకారు రైతులకే రుణ మాఫీ అమలు బెస్ట్
రుణ మాఫీ రైతులందరికి కాకుండా సన్న, మధ్యకారు రైతులకు మాత్రమే వర్తింపజేయాలని ఆర్థికవేత్త అమర్త్యసేన్ తెలిపారు. ఏ కారణం చేతనైనా చిన్న కమతాల రైతులు సాగు చేయలేకపోతే, ఆ కమతాల నుంచి వచ్చే ఆదాయానికి సమానమైన మొత్తాన్ని వారికి సహాయంగా అందించాలని సూచించారు. 
 
ఎక్కువ మంది జీవనాధారం వ్యవసాయం కావడమే సమస్య
దేశ జనాభాలో ఇప్పటికీ ఎక్కువ మందికి వ్యవసాయ రంగమే జీవనాధారం కావడమూ ప్రస్తుత సమస్యకు కారణమని అమర్త్యసేన్‌ అన్నారు. పారిశ్రామిక రంగంలో చాలినన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడక పోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోందన్నారు. యుపీఏ ప్రభుత్వంతో పోలిస్తే, ఎన్‌డీఏ హయాంలో ఉద్యోగాల కల్పన మరింత దెబ్బతిన్నదని చెప్పారు. 

ఉపాధి కల్పనలో యూపీఏ మెరుగు
విద్య, ఆరోగ్య విషయాల్లో అంతంత మాత్రంగానే ఉన్నా ఉద్యోగాల కల్పన విషయంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉన్నదని అమర్త్యసేన్ తెలిపారు.  ఉద్యోగాల కల్పన విషయంలో ప్రస్తుత ప్రభుత్వానికి పెద్దగా ఆసక్తి కూడా లేదని విమర్శించారు.

ఆర్థిక విస్తరణ ‘మానవ సామర్ధ్యం’పైనే ఆధారపడి ఉంటుందని అమర్త్య సేన్‌ స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్లే చైనా ఆర్థికంగా ప్రచండ శక్తిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. 

రుణ మాఫీలతో క్రెడిట్ కల్చర్‌కు నష్టం: ఆర్బీఐ
పంట రుణాల మాపీ పథకం అమలుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పెదవి విరిచారు. ఇది క్రెడిట్ కల్చర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన మూడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రుణమాఫీ పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆయా రాష్ట్రాల ద్రవ్య లభ్యతకు సంబంధించిన అంశం అని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు నిర్ణయాధికారం కలిగి ఉన్నయన్నారు. అయితే తమ రాష్ట్రాల ద్రవ్య లభ్యతను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా పంట రుణాలు మాఫీ చేయాలని సూచించారు. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రైతులు రూ.1.47 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు.