కేంద్ర ప్రభుత్వం మీ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ సహా అన్ని సోషల్ మీడియా వేదికలపై నిఘా వచ్చిందా మీరు మాట్లాడే ప్రతి ఫోన్ కాల్ రికార్డు అవుతోందా. అలాగే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా విమర్శ చేస్తే వెంటనే కోర్టు నుంచి సమన్లు అందుతాయా. వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.
గడచిన కొంతకాలంగా వాట్స్అప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ మెసేజి సారాంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఐటీ రూల్స్ ప్రవేశపెట్టిందని, వీటి అనుగుణంగా అన్ని ఫోన్ కాల్స్ రికార్డు అవుతాయని, అలాగే అన్ని కాల్ రికార్డింగ్స్ కూడా సేవ్ చేస్తామని, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా వేదికలు కూడా మానిటర్ చేస్తున్నామని. మీ ఫోన్ అలాగే ఇతర పరికరాలు ప్రభుత్వ శాఖలతో కనెక్ట్ అయి ఉంటాయని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి మెసేజ్ లు చేయకూడదని పోస్టులు వేయకూడదని, ఇలా 11 అంశాలతో దీర్ఘ మెసేజ్ అన్ని వాట్సప్ గ్రూపుల్లోనూ సోషల్ మీడియా వేదికల్లోనూ వైరల్ అవుతోంది.
అంతేకాదు సరికొత్త వాట్సప్ న్యూ రూల్స్ పేరిట నూతన నిబంధనలు వచ్చినట్లు పేర్కొంది. దీని ప్రకారం మీరు వాట్సప్ ద్వారా ఒక మెసేజీ పంపినప్పుడు దాని పక్కన టిక్కులు వచ్చినట్లయితే, ప్రభుత్వం మీ మెసేజ్ ను చూసినట్లు, ఇక రెడ్ మార్క్ వచ్చినట్లయితే మీ మీ మెసేజ్ పై చర్య తీసుకుంటున్నట్లు ఈ సందేశం సారాంశం. అలాగే మూడు రెడ్ మార్కులు వచ్చినట్లయితే మీకు త్వరలోనే కోర్టు నుంచి సమాన్లు వస్తాయని కూడా ఈ మెసేజ్ లో ఉంది.
అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇలాంటి సందేశాలను ప్రజలు నమ్మవద్దని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిఘా వేయడం లేదని పౌరుల భద్రత విషయంలో బాధ్యతతో ఉంటుందని పేర్కొంది. చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వం పనిచేయదని పేర్కొంది. దీనికి సంబంధించి PIB Fact Check తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో సోషల్ మీడియా వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజ్ పూర్తిగా సత్య దూరమని ప్రకటించింది.
ఇదిలా ఉంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ మెసేజీలను అడ్డుకట్ట వేసేందుకు శాయశక్తుల కృషి చేస్తోంది. గతంలో ఇలాంటి ఫేక్ మెసేజీలను గుర్తించి పిఐబి ఫ్యాక్ట్ పేరిట తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రజలకు వాస్తవాలను తెలియజేసింది. అంతే కాదు ఇలాంటి ఫేక్ మెసేజీలు మీరు పొందినట్లయితే వెంటనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు తెలియజేయాలని కూడా కోరింది.
