Asianet News TeluguAsianet News Telugu

డేటా లీక్ ఇక్కట్లు: జుకర్ బర్గ్ తప్పుకో ప్లీజ్.. మదుపర్ల డిమాండ్ ఇది

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిగా, దాని చైర్మన్, సీఈవోగా మార్క్ జూకర్‌బర్గ్ అందరికీ సుపరిచితమే. కానీ ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటారు.

Facebook investors want Zuckerberg to step down as company's chairman following report
Author
Washington, First Published Nov 18, 2018, 11:16 AM IST

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిగా, దాని చైర్మన్, సీఈవోగా మార్క్ జూకర్‌బర్గ్ అందరికీ సుపరిచితమే. కానీ ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటారు. అలా ఉంది ఫేస్‌బుక్ సీఈఓ కం చైర్మన్ మార్క్ జూకర్‌బర్గ్ పరిస్థితి.

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఆన్‌లైన్ సోషల్ మీడియా దిగ్గజం.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు.ఇప్పటికే డేటా చౌర్యంపై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జూకర్‌బర్గ్‌కు ప్రస్తుతం సంస్థ మదుపరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. 

డేటా లీక్‌తో ఇబ్బందుల్లో పడ్డ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ను రాజీనామా చేయాలని వాటాదారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారనే నివేదికలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నవార్తలే దీనికి కారణమని భావిస్తున్నారు. దీంతో మదుపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు ఫేస్‌బుక్‌లో వాటా ఉన్న వైస్ ప్రెసిడెంట్ జానాస్ కూడా జుకర్‌బర్గ్‌ను బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారట. దీంతో విమర్శకులు, ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోయడానికి ఏకంగా ఓ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) సంస్థనే ఫేస్‌బుక్ ప్రత్యేకంగా నియమించుకున్నదన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి.

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల వివాదం, కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణాల్లో దెబ్బతిన్న ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టుకోవడానికి రిపబ్లికన్ పార్టీకి చెందిన డిఫైనర్స్ పబ్లిక్ అఫైర్స్ అనే పీఆర్ సంస్థను ఫేస్‌బుక్ అద్దెకు తీసుకున్నదని న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన ఓ నివేదికలో పేర్కొన్నది.

మార్కెట్‌లోని ఫేస్‌బుక్ ప్రత్యర్థి సంస్థలకు వ్యతిరేకంగా ఈ పీఆర్ సంస్థ విమర్శనాత్మక కథనాలను ప్రచురించిందని వెల్లడించింది. ఫేస్‌బుక్ వ్యతిరేక వర్గాల్ని యూదుల వ్యతిరేకులుగా, బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్‌కు ముడిపెట్టి చూపేందుకూ జర్నలిస్టుల్నీ ప్రోత్సహించారని పేర్కొన్నది.

ఈ వార్తల నేపథ్యంలోజూకర్‌బర్గ్‌కు ట్రిల్లియం అసెట్ మేనేజ్‌మెంట్ సీనియర్ ఉపాధ్యక్షుడు జోనాస్ క్రోన్ శుక్రవారం రాత్రి ఫోన్ చేసి బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరారని ది టెలిగ్రాఫ్, ది గార్డియన్ పత్రికలు తెలిపాయి. ఫేస్‌బుక్‌లో ట్రిల్లియంకు 8.5 మిలియన్ యూరోల వాటా ఉన్నది. ఫేస్‌బుక్ ఓ సంస్థని, సంస్థల్లో చైర్మన్, సీఈవో పదవులు వేర్వేరుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డట్లు సదరు పత్రికలు చెప్పాయి.

ఇదిలావుంటే ఇవన్నీ అసత్య వార్తలేనని ఫేస్‌బుక్ వ్యవస్థాపక చైర్మన్ మార్క్ జూకర్‌బర్గ్ ఖండించారు. డిఫైనర్స్ పీఆర్ సంస్థను అద్దెకు తీసుకున్నట్లు తనకు అసలు తెలియదని మీడియాకు స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారం గురించి త్వరలోనే తాను తెలుసుకుంటానన్న జూకర్‌బర్గ్.. సదరు పీఆర్ సంస్థతో పనిచేయలేదని కూడా ప్రకటించారు.

మరోవైపు ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ సాండ్‌బర్గ్ కూడా డిఫైనర్స్‌తో సంబంధాలను తోసిపుచ్చారు. కాగా, తాజా వ్యవహారం నేపథ్యంలో ఫేస్‌బుక్ లాబీయింగ్ సంస్థల వినియోగంపై సమీక్షించాలన్నఆ సంస్థ నూతన అధిపతి సర్ నిక్ క్లేగ్ అభిప్రాయానికి బలం చేకూరుతున్నది.

వరుస వివాదాలతో జూకర్‌బర్గ్ సంపద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.1,25,000 కోట్ల (17.4 బిలియన్ డాలర్లు) వరకు ఆవిరైంది. ఫేస్‌బుక్ షేర్ విలువ శుక్రవారం ఒక్కరోజే 3 శాతం క్షీణించి 139.53 డాలర్ల వద్దకు పతనమైంది. గతేడాది ఏప్రిల్ నుంచి గమనిస్తే ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

ఈ క్రమంలో జూకర్‌బర్గ్ సంపద కూడా 55.3 బిలియన్ డాలర్లకు దిగజారింది. ఈ ఏడాది జూలై 25 స్థాయితో పోల్చితే 31 బిలియన్ డాలర్లకుపైగా ఆవిరైంది. నిన్నమొన్నటిదాకా ప్రపంచ కుబేరుల్లో జెఫ్ బెజోస్, బిల్‌గేట్స్ తర్వాత మూడో స్థానంలో ఉన్న జూకర్‌బర్గ్.. నేడు బ్లూంబర్గ్ బిలియనీర్ల సూచీపై ఆరో స్థానానికి పడిపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios