Asianet News TeluguAsianet News Telugu

నీరవ్‌ మోదీకి షాక్‌.. అరెస్టు వారెంటు జారీ

దాదాపు 15 నెలల క్రితం వెలుగు చూసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్ మోదీని అప్పగించాలని కోరుతూ భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి. ఇటీవల టెలిగ్రాఫ్ విలేకరికి లండన్ నగరంలో నీరవ్ మోదీ తారసపడిన సంగతి తెలిసిందే. తాజాగా లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నీరవ్ మోదీని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై బ్రిటన్ ప్రభుత్వం, స్కాట్లాండ్ పోలీసులు ప్రతిస్పందించాల్సి ఉంది. అయితే నీరవ్ మోదీ బ్రిటన్ చట్టాల మాటున కొంత కాలం భారత్‌కు అప్పగించకుండా తప్పించుకోవచ్చునేమో గానీ.. సొంత దేశానికి రాకుండా ఉండలేరని తేలిపోయింది. 

Extradition warrant issued against Nirav Modi, arrest imminent: Sources
Author
Hyderabad, First Published Mar 19, 2019, 11:13 AM IST

భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రత్యేకించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని లూటీ చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టు షాకిచ్చింది. అతడికి అరెస్ట్ వారెంట్ జారీచేసింది. స్థానిక పోలీసులు ఆయనను త్వరలోనే నిర్భందంలోకి తీసుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిసిస్తున్నాయి.

ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) రూ.14,000 కోట్లు ఎగ్గొట్టి నీరవ్ మోదీ విదేశాలకు తొలుత న్యూయార్క్ నగరానికి.. తదుపరి లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో నీరవ్‌ మోదీని అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన విజ్ఞప్తిపై స్పందించిన లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసినట్లు సోమవారం అధికారులు తెలిపారు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనకు అనుగుణంగానే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ ఈ నెల 9న లండన్‌లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్‌ కోర్టు అతడికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. 

నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌లో వజ్రాల వ్యాపారం చేస్తున్నాడంటూ ఇటీవల అక్కడ ఓ పత్రిక కథనం ప్రచురించింది. ఓ ఖరీదైన కోటును ధరించిన నీరవ్‌.. అక్కడ ఓ పాత్రికేయుడికి తారసపడటంతో అతడు లండన్‌లో ఉన్నట్టు తెలిసింది. టెలిగ్రాఫ్ దినపత్రిక విలేకరికి తారసపడిన నీరవ్ మోదీ.. ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికి ‘నో’ కామెంట్స్ అంటూ దాటవేయడంతోపాటు అప్పటికప్పుడు క్యాబ్‌లో అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

అయితే నీరవ్ మోదీ అరెస్టయ్యాక అప్పగింత విచారణ మొదలవుతుందని లండన్ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు బ్రిటన్ కోర్టు, స్టాట్లాండ్ యార్డ్ పోలీసులు దీన్ని ధ్రువీకరించలేమని, అలాగే కొట్టిపారేయలేమని కూడా వ్యాఖ్యానించాయి. నీరవ్‌ మోడీపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయినా ఆయనకు పెద్దగా పోయేదేమీ లేదంటున్నారు.

అయనను ఇప్పట్లో భారత్‌కు తెచ్చి విచారణ జరిపేందుకు వీలు కాకపోవచ్చని బ్రిటన్‌ న్యాయ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌ చట్టాలు అక్కడి వారికి అంతటి గట్టి భద్రతనిస్తున్నాయని వారంటున్నారు. అప్పగింతకు వ్యతిరేకంగా నీరవ్ మోదీ పిటిషన్ దాఖలు చేసే హక్కులు బ్రిటన్ చట్టాలు కల్పిస్తున్నాయి. 

విజయ్ మాల్యా అప్పగింతకూ ఈ వెస్ట్‌మినిస్టర్ కోర్టే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో మద్యం వ్యాపారి, కింగ్ ఫిషర్స్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాను అరెస్ట్ చేసేందుకు కూడా స్థానిక లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని.. అయితే ఆ తరవాత ఆయన కోర్టుకు వచ్చి తదిపరి విచారణకు అంగీకరిస్తూనే బెయిల్‌కు పిటిషన్‌ పెట్టుకున్నట్లే.. నీరవ్ మోదీ చేయొచ్చునని స్థానిక న్యాయవేత్తలు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios