లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. చైర్మన్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. 

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. చైర్మన్‌తో పాటు మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. రాజ్ కుమార్ జనవరి 31న పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆయన పదవిని వచ్చే సంవత్సరం (2023) మార్చి వరకు పొడిగించింది.

ఎల్ఐసీ ఐపీవోకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎంఆర్ కుమార్ పదవీ కాలాన్ని ప్రభుత్వం ఏడాది పొడిగించింది. 2021-2022 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు ఎల్ఐసీని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే. ఎల్ఐసీ ఐపీవోకు వీలుగా ఎల్ఐసీ కార్పోరేషన్ చట్టానికి ప్రభుత్వం పలు మార్పులు చేసింది.

ఎక్స్చేంజీల్లో నమోదయ్యేందుకు అనువుగా, లిస్టింగ్ నిబంధనలను అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను కూడా నియమించింది. చైర్మన్ పదవీ విరమణ వయసు నిబంధనలు సడలించింది. ఇవి గత ఏడాది జూన్ నుండి అమల్లోకి వచ్చాయి. ఎల్ఐసీ చైర్మన్ పదవీ కాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. గత ఏడాది జూన్ నెలలో ఆయన పదవీ కాలాన్ని 9 నెలలు, ఇప్పుడు మరో ఏడాదికి పైగా పొడిగించారు. ఎల్ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.1 లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమీకరించాలని భావించింది. కానీ కరోనా నేపథ్యంలో ఈ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. అయితే ఎల్ఐసీ ఐపీవో వస్తే మాత్రం సగం కంటే ఎక్కువ నిధులు సమకూరినట్లే.