Asianet News TeluguAsianet News Telugu

హెచ్1పై ట్రంప్ ఆంక్షలు: మనోళ్ల ‘అమెరికా కల’ కష్టమే?!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చేస్తున్న ‘అమెరికన్ ఫస్ట్’ నినాదంతో భారతీయుల ‘అమెరికా కల’ సాకారమయ్యే సంకేతాలేమీ కనిపించడం లేదు. పూర్తిగా హెచ్1 బీ వీసా నిబంధనల పునర్నిర్వచించడానికే కంకణం కట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం 1.20 లక్షల మంది హెచ్ 1 బీ వీసా కింద పని చేస్తుండగా, హెచ్ 4 వీసా కింద మరో 1.26 లక్షల మంది భారతీయులు అనుమతి పొందారు.

Explained: Move that could kill the US dream for many Indians
Author
Washington, First Published Nov 11, 2018, 12:40 PM IST

అమెరికాలోకి అత్యంత నిఫుణులైన విదేశీయులు మాత్రమే ప్రవేశించడానికి హెచ్‌–1బీ వీసాలు మెరుగైన పాత్ర పోషించేలా వలస విధానాలు ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోందని వైట్‌హౌజ్‌ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

ప్రస్తుత హెచ్‌–1బీ వీసాల విధానం ‘ఔట్‌ సోర్సింగ్‌’ నియామకాల మాదిరిగా ఉండకూడదని వారంటున్నారు. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా సంస్థలను అనుమతించేవే హెచ్‌1బీ వీసాలు.

హెచ్1 బీ వీసా పునర్నిర్వచనానికి ప్రణాళికలు
ప్రత్యేక నైపుణ్యాలు అంటే ఏంటో, హెచ్‌–1బీ వీసా కింద ఉపాధి అంటే ఏంటో పునర్నిర్వచించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అంతే కాదు హెచ్1 బీ వీసాదారుడి జీవిత భాగస్వామికి హెచ్4 వీసా కింద ఉపాధి కల్పించే నిబంధనకు మంగళం పాడేందుకు కూడా ట్రంప్ సర్కార్ సంసిద్ధమవుతోంది.

హెచ్ 4 వీసా కింద ప్రస్తుతం 70వేలమందికి పైగా భారతీయ మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నిబంధనను ఎత్తివేస్తామన్న ట్రంప్ సర్కార్ మూడుసార్లు నోటిఫికేషన్ జారీని వాయిదా వేసింది. 

నియంత్రణ పద్దతుల్లో ముందుకెళ్లాలని ట్రంప్ నిర్ణయం
దీనిపై వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ కోఆర్డినేషన్ క్రిస్‌ లిడ్డెల్‌ మాట్లాడుతూ ‘అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలో ఉండేలా చూసేందుకు ఆయన విధానాలు రూపొందిస్తున్నారు. ఈ రకమైన వలసలపైన మాత్రమే ఆయన సానుకూలంగా ఉన్నారు’ అని తెలిపారు.

హెచ్1బీ విధానాల్లో చాలావరకు అంశాలు చట్టపరమైనవే. వాటిని మారిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయేమోనని ట్రంప్ భావిస్తున్నారు. నియంత్రణ పద్ధతిలో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అని క్రిస్ లిడెల్ చెప్పారు. 

అత్యంత నిపుణులకే అమెరికాలో చోటు కల్పించేలా..
అమెరికాలో ప్రస్తుతం 1.20 లక్షల మంది హెచ్1బీ ఉద్యోగులు ఉన్నారని, ఈ సంఖ్య తక్కువేమీ కాదని వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ కోఆర్డినేషన్ అన్నారు. ఈ 1.20 లక్షల మందిలో అత్యధికులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తక్కువ నైపుణ్యం కలవారే. హెచ్1బీ వీసా విధానంతో వారంతా వచ్చిచేరినందుకే ఈ విధానాన్ని మార్చి వివిధ రంగాల్లో అత్యంత నిపుణులను దేశంలోకి వచ్చేలా చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. 

ట్రంప్ వచ్చాక పెరిగిన హెచ్1 వీసాల తిరస్కరణ 
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక హెచ్‌–1బీ వీసా దరఖాస్తుల తిరస్కరణ, దరఖాస్తులను తొక్కిపెట్టడం తదితరాలు పెరిగాయని కంపీట్‌ అమెరికా ఆరోపించింది. సాంకేతిక దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్‌ తదితర సంస్థల సమాఖ్య ఈ కంపీట్‌ అమెరికా.

‘హెచ్‌–1బీ వీసాల జారీలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో 3 మార్పులను గమనించాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు అమెరికా కంపెనీల హెచ్‌–1బీ వీసాల దరఖాస్తులను ఎక్కువ సంఖ్యలో తొక్కిపెడుతున్నారు’ అని పేర్కొంది.

ఇలా చేసేందుకు మీకు అధికారం లేదన్న కంపీట్ అమెరికా
‘హెచ్ 1బీ వీసా దరఖాస్తులను తొక్కి పట్టేందుకు మీకు చట్టబద్ధంగా అధికారం లేదు. మీ విధానాలు, పద్ధతులపై కంపెనీలకు స్పష్టత లేకుండా పోతోంది. దీంతో విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న కంపెనీలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది’ అని అమెరికా హోంలాండ్‌ సెక్రటరీకి, వలస సేవల విభాగం డైరెక్టర్‌కు ఈ నెల 1న కంపీట్‌ అమెరికా లేఖలు రాసింది. గత 18 నెలల్లో హెచ్‌1బీ దరఖాస్తులను తిరస్కరించడం, రిక్వెస్ట్స్‌ ఫర్‌ ఎవిడెన్స్‌లను కోరడం  పెరిగిందని కంపీట్‌ అమెరికా ఆరోపించింది.

హెచ్‌–4పై ప్రజాభిప్రాయం తీసుకుంటాం
హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే హెచ్‌–4 వీసాలకు ఉద్యోగానుమతుల రద్దు విషయంపై ప్రజాభిప్రాయం కోరతామని ట్రంప్‌ ప్రభుత్వం వెల్లడించింది. హెచ్‌–4 వీసాలు ఉన్న వారూ ఉద్యోగాలు చేసుకునేందుకు గతంలో ఒబామా సర్కారు అనుమతులివ్వడం తెల్సిందే.

హెచ్‌–4 వీసాలకు ఉద్యోగ అనుమతులను రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వలస సేవల విభాగం డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ సిస్నా తెలిపారు.

గతేడాది డిసెంబర్ 25 నాటికి హెచ్4 వీసా కింద ఉద్యోగాలు పొందేందుకు 1,26,853 దరఖాస్తులను ఆమోదం తెలిపింది. వీటిలో 93 శాతం భారతీయుల దరఖాస్తులే. ఐదు శాతం చైనీయులవి ఉన్నాయి.

ఈ దేశాల పౌరులకు శరణార్థి హోదా ఇవ్వొద్దని నిర్ణయం
హోండురాస్, గ్వాటెమాల, ఎల్‌ సాల్వడార్‌ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారికి శరణార్థి హోదా ఇవ్వకూడదంటూ ట్రంప్‌ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత శరణార్థి చట్టం కింద ఈ దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలో ఆశ్రయం లభిస్తోంది. ఇకపై కొన్ని అధికారిక మార్గాల్లో వస్తేనే శరణార్థి హోదా దక్కుతుందంటూ అమెరికా న్యాయ విభాగం, హోంలాండ్‌ సెక్యూరిటీ విభాగం తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios