హిమాలయ యోగితో సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఎస్ఈ మాజీ చీప్ చిత్రా రామ‌కృష్ణ‌ను శుక్ర‌వారం సీబీఐ అధికారులు విచారించారు. 

హిమాలయ యోగితో సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఎస్ఈ మాజీ చీప్ చిత్రా రామ‌కృష్ణ‌ను శుక్ర‌వారం సీబీఐ అధికారులు విచారించారు. హిమాలయాల్లో నివసిస్తున్న ఆధ్యాత్మిక గురువుతో ఆర్థిక సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపణలు రావడంతో అప్రమత్తమైంది దర్యాప్త సంస్థ.

హిమాలయ యోగితో రహస్య వ్యాపార విషయాలు పంచుకుని సెబీ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు ఎదుర్కొంటోన్న జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీబీఐ అధికారులు శుక్ర‌వారం ఆమెను ప్రశ్నించారు. టిక్ బై టిక్ మార్కెట్ తారు మారు కేసులో దేశంలోని అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్‌కి మాజీ చీప్ గా పని చేశారు చిత్రా రామ‌కృష్ణ. ఆమెను ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారించిన‌ట్లు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసుకు సంబంధించి ముందుగా అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్పటి నుంచి సరికొత్తగా వాస్తవాలు వెలుగు చూశాయి. దీంతో వాటి ఆధారంగా చిత్రా రామకృష్ణను (Chitra Ramakrishna) అధికారులు ప్రశ్నించారు. 

ఎన్ఎస్ఈలో అక్రమాలకు సంబంధించిన పాత కేసులో భాగంగా ఆమెను విచారించారు. అంతేగాక, చిత్రా దేశం విడిచి వెళ్లకుండా ఉండేలా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఎన్ఎస్ఈ మాజీ సీఈవో రవి నరైన్, మాజీ సీఓఓ ఆనంద్ సుబ్రమణియన్లపై కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. నిజానికి ఎన్ఎస్ఈలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు 2018లోనే ఆమెపై ఎఫ్ఐఆర్‌ నమోదైంది. 

ఇటీవల చిత్రా గురించి సంచలన విషయాలు బయటపడిన విషయం తెలిసిందే. ఓ హిమాలయ యోగితో ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారని, నియామకాల్లో ఆయన చెప్పినట్లే చిత్రా
నడుచుకున్నారని సెబీ ఇటీవల వెల్లడించిన ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే ఆమెపై నమోదైన పాత కేసుల్లో అధికారులు మళ్లీ దర్యాప్తు చేపట్టారు. 

ఇందులో భాగంగానే ఆనంద్ సుబ్రమణియన్‌ను ఎన్ఎస్ఈ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ అడ్వైజర్‌గా నియమించడంలో చిత్రా అవకతవకలకు పాల్పడ్డారని ఆమెపై ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా సెబీకి సంచలన విష‌యాలు తెలిశాయి. హిమాలయాల్లో ఉండే ఓ ఆధ్యాత్మిక యోగి చిత్రాపై ప్రభావం చూపించారని, ఆమెను కీలుబొమ్మ‌గా చేసి ఎస్ఎస్ఈను ఆ యోగి న‌డిపించార‌ని సెబీ గుర్తించింది. అలాగే.. 2010 నుంచి 2014 దాకా స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్వర్ల నుంచి బ్రోకర్లను టిక్ బై టిక్‌ ఆధారిత సిస్టమ్ ఆర్కిటెక్చర్ ద్వారా సమాచారం వరుస పద్ధతిలో పంపించారని సెబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. అలాగే ఎన్‌ఎస్ఈకి సంబంధించిన కీల‌క విష‌యాల‌ను చిత్రా ఆ యోగితో పంచుకున్నార‌ని సెబీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు చిత్రా రామకృష్ణకు సెబీ రూ. 3 కోట్ల జరిమానా విధించింది. 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాలని సెబీ ఆమెను ఆదేశించింది. 

చిత్రా కెరీర్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా స్టార్ట్ అయింది. 1985లో ఐడీబీఐ బ్యాంక్‌కు చెందిన ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ డివిజన్‌లో చేరారు. ఆ త‌ర్వాత కొంతకాలం సెబీలో పనిచేసి.. మ‌ళ్లీ ఐడీబీఐ బ్యాంక్‌కు తిరిగొచ్చారు. బీఎస్‌ఈలో హర్షద్‌ మెహతా కుంభకోణం తర్వాత.. పారదర్శక ట్రేడింగ్ కోసం కేంద్రం ఐదుగురితో ఎన్ఎస్ఈ ఏర్పాటు చేయ‌గా.. అందులో చిత్రా రామకృష్ణ ఒకరు. 2009లో చిత్రా.. NSEకి ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2013లో NSE సీఈఓగా ఎదిగారు. 20 ఏళ్ల‌ పాటు ఎన్‌ఎస్‌ఈకి వ‌ర్క్ చేసిన చిత్రా.. 2016 డిసెంబరులో అనూహ్యంగా ఎండీ, సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అదే స‌మ‌యంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో సెబీ ఆమెపై చర్యలు చేపట్టింది.

ఇక‌పోతే.. చిత్రా రామ‌కృష్ణ ఈ-మెయిల్స్ ప‌రిశీలించిన సెబీ ద‌ర్యాప్తు బృందం ఆమె చెబుతున్న‌ట్టు అత‌ను అదృశ్య యోగినో.. హిమాల‌య యోగినో కాక‌పోవ‌చ్చ‌ని.. ఓ అదృశ్య వ్య‌క్తి అయి ఉంటార‌ని అంటోంది. ఇక‌.. ఆ వ్య‌క్తికి ఆనంద్ సుబ్ర‌మ‌ణియ‌న్‌కు ఎలాంటి సంబంధం ఉంది..? ఆయ‌నే ఈయ‌నా..? చిత్రానే ఇలా అదృశ్య డ్రామా ప్లే చేస్తోందా..? అనే కోణంలోనూ సెబీ విచారిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.