ముంబై: వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొచ్చర్‌ ఇల్లు, ఆస్తులను కేసుకు అటాచ్‌ చేసింది. ముంబైలోని చందాకొచ్చర్‌ ఫ్లాట్‌, ఆమె భర్త దీపక్‌ కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. వీటి విలువ సుమారు రూ. 78 కోట్లని అధికారులు వెల్లడించారు. 

also read దిగోచ్చిన బంగారం, వెండి ధరలు...10 గ్రాములకు ఎంతంటే ? 

వీడియోకాన్‌ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో అవినీతి, అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ధూత్‌ తదితరులపై దర్యాప్తు జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతేడాది మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద క్రిమినల్‌ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకొని ఈడీ ఈ చర్య చేపట్టింది.

ఈ కేసులో సీబీఐ వేణుగోపాల్‌ధూత్‌కు చెందిన వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (వీఐఈఎల్‌), వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (వీఐఎల్‌), సుప్రీం ఎనర్జీ కంపెనీలతోపాటు దీపక్‌ కొచ్చర్‌ ఆధీనంలోని నూపవర్‌ రెన్యువబుల్స్‌ సంస్థను నిందితులుగా చేర్చింది. 

చందా కొచ్చర్‌ 2009 మే 1న ఐసీఐసీఐ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీడియోకాన్‌ గ్రూపునకు ఆ బ్యాంకు రుణాలు మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా ‘క్విడ్‌ప్రోకో’ పద్ధతిలో వేణుగోపాల్‌ధూత్‌ సుప్రీం ఎనర్జీ సంస్థ ద్వారా నూపవర్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టించాడని, ఆ తర్వాత దీపక్‌ కొచ్చర్‌, వేణుగోపాల్‌ధూత్‌ మధ్య అనేక లావాదేవీలు జరుగడంతో నూపవర్‌, సుప్రీం ఎనర్జీ సంస్థల యాజమాన్యం చేతులు మారిందని సీబీఐ ఆరోపించింది. 

also read ఇరాన్ పై డ్రోన్ దాడుల తరువాత... చైనాతో అమెరికా ఫ్రెండ్ షిప్...కారణం..?

2009 జూన్‌ నుంచి 2011 అక్టోబర్‌ మధ్యకాలంలో ఐసీఐసీఐ బ్యాంకు నిబంధనలకు వ్యతిరేకంగా వీడియోకాన్‌ గ్రూపుతోపాటు దాని అనుబంధ సంస్థలకు రూ.1.875 కోట్ల రుణాలు మంజూరయ్యాయని, ఈ రుణాలను 2012లో మొండి బాకీలుగా ప్రకటించడంతో ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.1,730 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక దర్యాప్తులో సీబీఐ గుర్తించింది. 

చందా కొచ్చర్‌ హయాంలో మరో రెండు కంపెనీలకు (గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌కు, భూషణ్‌ స్టీల్‌ గ్రూపునకు) ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన రుణాలపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈ రెండు సంస్థలపైనా ఆరోపణలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వర్గాలు వెల్లడించాయి.