రుణాల డిఫాల్ట్‌తో వేలానికి వచ్చిన ఎస్సార్‌ స్టీల్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బ్యాంకుల రుణాలు చెల్లించలేక దివాళా ప్రకటించి.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న ఎస్సార్ స్టీల్‌ను ప్రపంచంలో స్టీల్ తయారీలో అగ్రగామి సంస్థ లక్ష్మీ మిట్టల్ సారథ్యంలోని ఆర్సెలార్ మిట్టల్ కైవసం చేసుకోవడానికి రంగం సిద్ధమవుతున్నది. ఇటీవల జరిగిన వేలంలో ఆర్సెలార్ మిట్టల్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్సార్ స్టీల్ రుణదాతలు అంగీకరించారు. ఈ బిడ్ విలువ రూ.42 వేల కోట్లు. దాదాపు అంతా ఓకే అని భావిస్తున్న తరుణంలో ఎస్సార్ స్టీల్స్ ప్రమోటర్ ‘రుయా’ కుటుంబం పునరాలోచనలో పడింది.  

కంపెనీ తమ చేతుల్లోంచి జారిపోకుండా రుయా కుటుంబం (ప్రమోటర్లు) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేసే దిశగా ముందడుగు వేసింది. దివాళా ప్రక్రియను ఉపసంహరించుకోవాలని బ్యాంకర్లను కోరింది.

బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తం రూ.54,389 కోట్లు కడతామంటూ ప్రతిపాదించింది. ఇప్పటి వరకు దివాళా ప్రకటించిన సదరు ఎస్సార్ స్టీల్ యాజమాన్యం.. సదరు రూ.54,389 కోట్లలో నగదు రూపంలో రూ.47,507 కోట్లు ముందస్తుగా చెల్లించేందుకు కూడా సిద్ధమని పేర్కొంది.

ఎస్సార్‌ స్టీల్‌ను వేలంలో కొనుగోలు చేసేందుకు ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్‌ ఆఫర్‌ చేసిన రూ.42,202 కోట్ల కన్నా రుయా కుటుంబం ప్రతిపాదించిన మొత్తం అధికం కావడం గమనార్హం. దాదాపు రూ.49,000 కోట్ల రుణాలను వసూలు చేసుకునేందుకు బ్యాంకర్లు ఎస్సార్‌ స్టీల్‌ను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. 

‘ఎస్సార్‌ స్టీల్‌ ఇండియా రుణదాతలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి పూర్తి సెటిల్మెంట్‌ కోసం దాదాపు రూ. 54,389 కోట్లు చెల్లించేట్లుగా రుణదాతల కమిటీ (సీఓసీ)కి ఎస్సార్‌ స్టీల్‌ వాటాదారులు ప్రతిపాదన సమర్పించారు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్థిక రుణదాతలకు మొత్తం రూ.49,395 కోట్లు, నిర్వహణపరమైన రుణదాతలకు రూ.4,976 కోట్లు, ఉద్యోగులకు మరో రూ.18 కోట్లు ఇచ్చి సెటిల్‌ చేసుకునేలా రుయాలు ఆఫర్‌ చేసినట్లు వివరించాయి. 

ఎస్సార్ స్టీల్ కైవసానికి ఇప్పటి వరకు వచ్చిన రుణ పరిష్కార ప్రణాళికల్లో ఆర్సెలర్ మిట్టల్‌దే అతిపెద్దది కావడం విశేషం. ఈ బిడ్ విలువ రూ.42 వేల కోట్లు. ఎస్సార్ స్టీల్ కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఇప్పుడు దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి ఆమోదముద్ర తెచ్చుకోవాల్సి ఉంది.

ఇటీవల ఆర్సెలార్ మిట్టల్, వేదాంత గ్రూపుల రుణ ప్రణాళికలను కమిటీ క్రెడిటార్స్(సీవోసీ) పరిశీలించింది. ఇప్పటి వరకు వచ్చిన బిడ్లలో ఈ రెండు కంపెనీలే తుదివరకు నిలిచాయి. రష్యాకు చెందిన వీటీబీ బ్యాంక్ ప్రమోట్ చేస్తున్న న్యూమెటల్ బిడ్‌కు అర్హత సాధించలేకపోయింది. 

అయితే ‘దివాళా ప్రక్రియ’ను ఉపసంహరించాలని ఎస్సార్ స్టీల్ ప్రమోటర్లు చేసిన ప్రతిపాదన విజయవంతమయ్యే సంకేతాలు కనిపించడం లేదని న్యాయవాదులు చెబుతున్నారు. రుయా ఫ్యామిలీ ప్రతిపాదన సరైన పద్ధతిలో లేదని ఏజడ్బీ అండ్ పార్టనర్స్ అనే లా సంస్థ నిర్వాహకులు నిలాంగ్ దేశాయి తెలిపారు.

శార్దూల్ అమర్ చందర్ మంగళ్ దాస్ భాగస్వామి శార్దుల్ షరాఫ్ మాట్లాడుతూ రుయా కుటుంబం తెర వెనుక నుంచి ఎస్సార్ స్టీల్ ను ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. ఇది బ్యాంకర్లను తప్పుదోవ పట్టించడమే అవుతుందన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు.