Asianet News TeluguAsianet News Telugu

వచ్చే 6 నెలలూ న్యూజాబ్స్ కష్టమే.. విద్యుత్-ఇంధన రంగంలో చాన్సెస్


డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, ఆర్థిక రంగంలో అనిశ్చితి వంటి పరిణామాల్లో వచ్చే ఆరు నెలల పాటు ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడతాయని టీం లీజ్ ఔట్ లుక్ నివేదిక పేర్కొంది. కాకుంటే విద్యుత్, ఇంధన రంగాల్లో మాత్రం అవకాశాలు ఉన్నాయని వివరించింది.

Employment outlook sees dip in India in H2FY19; but highest in world
Author
Mumbai, First Published Nov 15, 2018, 10:36 AM IST

ముంబై: వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగ నియామకాలు కష్టమేనని తెలుస్తోంది. కాకుంటే రియాల్టీ, టెలికం రంగాల్లో కొంత మెరుగైన అవకాశాలు ఉన్నాయని లీమ్ లీజ్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ నివేదిక పేర్కొన్నది. వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగ నియామకాలు మూడు శాతం తగ్గి 92 శాతానికి చేరుకున్నాయని ఈ సంస్థ నివేదిక పేర్కొంది. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ తగ్గి, చమురు ధరల పెరుగుదల ఇందుకు దోహదం చేశాయని వెల్లడించింది. ఏప్రిల్‌-సెప్టెంబర్‌ 2018 అర్ధభాగంలో నియామకాలు 95 శాతం ఉండటం గమనార్హం.

దేశంలోని 14 నగరాల్లో 19 రంగాల్లోని 750 సంస్థలు, చిన్న, మధ్య, భారీ సంస్థలకు చెందిన 2,500 మంది ఉద్యోగులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. నిలకడగా పెరుగుతున్న జీడీపీ వృద్ధి ఉద్యోగ నియామకాల జోరు పెంచలేదని తెలుస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌లోనే ఉద్యోగ నియామకాల్లో కాస్త పెరుగుదల ఎక్కువగా ఉందని ఆయా సంస్థలు పేర్కొన్నాయి. విద్యుత్‌, ఇంధన రంగంలో నాలుగుశాతం వృద్ధి నమోదవుతుందని తెలుస్తోంది.

కాకుంటే చిన్న నగరాలు, పట్టణాల్లో రెండో అర్ధభాగంలో నియామకాలు ఊపందుకుంటాయని టీమ్‌‌లీజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షురాలు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 2018-19 అర్ధభాగంలో తాజా పట్టభద్రుల నియామకాలు 16.3 శాతంగా ఉండటం సంతోషకరం. కొత్త ఉద్యోగార్థులకు ఇది శుభవార్త’ అని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక సేవలు (3%), మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ (3 %), విద్యా సేవలు (3%), వైద్యం, ఫార్మా (2%), ఈ-కామర్స్‌, టెక్‌ స్టార్టప్స్‌ (2%), తయారీ, ఇంజినీరింగ్‌, మౌలిక సదుపాయాలు (2%), ప్రయాణ, ఆతిథ్యం (2%) వంటి రంగాల్లో నియామకాలు పెరిగే అవకాశాలున్నాయి.

నిర్మాణం, స్థిరాస్తి, రిటైల్‌, టెలి కమ్యూనికేషన్స్‌ రంగాల్లో 3 శాతం క్షీణత కనిపించింది. వ్యవసాయం, వ్యవసాయ రసాయనాలు, బీపీఓ/ఐటీఈఎస్‌, ఐటీ రంగాల్లో 2 శాతం, ఎఫ్‌ఎంసీజీలో 1 శాతం తగ్గుదల నమోదైంది. విద్యుత్‌, ఇంధన రంగం 44,650, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం 46,300 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. ముంబైలో 1.66 లక్షలు, ఢిల్లీలో 1.55 లక్షలు, బెంగళూరులో 1.52 లక్షలు, హైదరాబాద్‌ నగర పరిధిలో 96 వేల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయి. 

19 సెక్టార్లకు 8 రంగాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని నెట్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ తెలిపింది. మరో ఏడు సెక్టార్లలో తగ్గుదల నమోదైంది. విద్యుత్, ఇంధన రంగాల్లో నాలుగుశాతం నియామకాలు పెరుగనున్నాయి. తదుపరి ఆర్థిక సేవలు, మీడియా అండ్ వినోదం, విద్యా సర్వీసుల్లో మూడు శాతం చొప్పున అదనపు నియామకాలు జరుగుతాయి. హెల్త్ కేర్ అండ్ ఫార్మా, ఈ- కామర్స్ అండ్ టెక్ స్టార్టప్స్, ఉత్పత్తి, ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ రంగాల్లో రెండు శాతం నియామకాలు జరుగుతాయి. 

ఇక భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్, టెలీ కమ్యూనికేషన్స్ రంగాల్లో మూడు శాతం, వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్, బీపీఓ/ఐటీఈఎస్, ఐటీ రంగాల్లో రెండేసి శాతం, ఎఫ్ఎంసీజీ విభాగంలో ఒక శాతం నియామకాలు పడిపోతాయి. వివిధ రంగాల్లో జూనియర్, సీనియర్ లెవెల్స్‌లో కొత్త ఉద్యోగాలు మూడు, నాలుగు శాతం తగ్గిపోతుండగా, మధ్య స్థాయిలో మూడు శాతం నియామకాలు పెరుగుతాయి. ఒక్క శాతం మంది ఉద్యోగాలు నిలుపుకోగలుగుతారని టీమ్ లీజ్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ నివేదిక పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios