ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ కొనుగోలు విషయంలో వెనకడుగు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలాన్ మస్క్ ట్విటర్‌ కొనేందుకు చేసిన  44 బిలియన్ డాలర్ల డీల్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎలాన్ మస్క్ మరో సంచలనానికి కేంద్ర బిందువు కానున్నారు. ఎంతో ఇష్టపడి ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేద్దామని భావించిన మస్క్, ఇప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ట్విటర్ లోని ఫేక్ అకౌంట్లే అనే వాదన వినిపిస్తోంది. ప్రముఖ పత్రిక ది వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోని నకిలీ లేదా స్పామ్ ఖాతాల సంఖ్యలో 5 శాతం కంటే ఎక్కువగా ఉంటే, తాను ఈ డీల్ నుండి వెనక్కి తగ్గుతానని గతంలోనే ప్రకటించాడు. అయితే, ఈ మొత్తం సమస్యపై, ప్రతిరోజూ 1 మిలియన్ స్పామ్ ఖాతాలను ప్లాట్‌ఫారమ్ నుండి తీసివేస్తున్నామని ట్విట్టర్ ఇప్పటికే తెలిపింది.

ఎలాన్ మస్క్ వాదన ఇదే...
ట్విటర్‌లోని ఫేక్ అకౌంట్స్ విషయలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ కలత చెందాడు. ఫేక్ అకౌంట్స్ వల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ దుర్వినియోగానికి గురవుతుందని ఆయన భావిస్తున్నారు. ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌లో స్పామ్ ఖాతాలను తక్కువగా చూపుతోందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ ఆటోమేటెడ్ ఖాతాలు, తప్పుడు సమాచారం, మోసాలు జరిగేందుకు ఆజ్యం పోస్తున్నాయని మస్క్ వాపోయారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, ఎలాన్ మస్క్ అంతర్గత డేటాను యాక్సెస్ చేసిన తర్వాత కూడా నకిలీ ఖాతాను తొలగించలేకపోయాడు.

ట్విట్టర్ వాదన ఇదే..
ఇటీవల బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఒక ప్రకటనలో, ట్విట్టర్ ప్రతినిధి ఇలా అన్నారు, “ట్విటర్ ఎలోన్ మస్క్‌తో పూర్తి సమాచారాన్ని పంచుకుంటోంది. ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. "ఇది మా వాటాదారులకు మెరుగైన ఒప్పందం అని మేము నమ్ముతున్నాము" అని ఆయన తెలిపారు. మేము అంగీకరించిన ధర, షరతులతో ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. 

ఏ ఖాతా సరైనదో మరియు ఏది నకిలీదో Twitter ఎలా కనుగొంటుంది?
ట్విట్టర్ ఐపి అడ్రస్, ఫోన్ నంబర్, లొకేషన్, ఖాతా ప్రవర్తన వంటి వ్యక్తిగత, ప్రైవేట్ డేటాను ఉపయోగించడం ద్వారా, ఖాతా నకిలీదా లేదా నిజమా అని కంపెనీ నిర్ణయిస్తుందని ట్విట్టర్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ ఖాతాలు ఒక సమస్యగా మారాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో కొన్ని అసహజ ట్రెండింగ్స్ వల్ల ఈ అనుమానాలకు తావిస్తోంది. అలాగే ట్విట్టర్ లో హేట్ స్పీచ్ కు కూడా విరివిగా స్థానం లభిస్తోంది. దీనిపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మతాల మద్య చిచ్చు పెట్టే ట్రెండింగ్స్ కూడా ట్విట్టర్ లో తరచూ టాప్ లో ఉండటం గమనించవచ్చు. దీని వెనుక ఫేక్ అకౌంట్స్ ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.