ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలపై ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కామెంట్ చేశారు. మస్క్‌ అడిగిన పోల్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలన్నారు. ఎలన్ మస్క్ ట్విట్టర్ యూజర్ల కోసం ఒక పోల్ పెట్టారు. అందులో ట్విట్టర్ ఎడిట్ బటన్ ఎంతమందికి కావాలో తెలియజేయాలని కోరారు.  

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ చర్యలు ఊహాతీతం. మ‌న భాష‌లో చెప్పాలంటే తిక్కతిక్కగా అతని ప్రవర్తన కనిపిస్తున్నా ప్రతీదానికి ఓ కచ్చితమైన లెక్క ఉంటుంది. అందుకే అతనితో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగ్రావాల్‌. మీకు ఎడిట్‌ బటన్‌ కావాలా అంటూ ట్విట్టర్‌లో 2022 ఏప్రిల్ 5న ఉద‌యం ఓ పోల్‌ పెట్టారు ఎలన్‌ మస్క్‌. పోల్‌ ప్రారంభించడం ఆలస్యం వేలాదిగా యూజర్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఎడిట్‌ బటన్‌ ఉండాలని చెప్పగా మరికొందరు ఎడిట్‌ బటన్‌తో మజా పోతుందంటున్నారు. అయితే ఈ ట్వీట్‌ ఎలన్‌ మస్క్‌ నుంచి వచ్చిన గంట సేపటికే ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగ్రావాల్‌ స్పందించారు.

ఎలన్‌ మస్క్‌ నిర్వహించే పోల్‌, ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి జాగ్రత్తగా పోల్‌ చేయండి అంటూ పరాగ్‌ అగ్రావాల్‌ తెలిపారు. ఈ మేరకు ఎలన్‌ మస్క్‌ పోల్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేస్తూ కామెంట్‌ జత చేశారు. ఎందుకంటే ఎలన్‌ మస్క్‌ ఇప్పుడు ట్విట్టర్‌లో మేజర్‌ షేర్‌ హోల్డర్‌గా ఉన్నారు. మూడో కంటికి తెలియకుండా ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాలు చేజిక్కించుకున్నారు. 2022 మార్చి 24న నిర్వహించిన పోల్‌లో ఫ్రీ స్పీచ్‌ స్ఫూర్తికి ట్విట్టర్‌ కట్టుబడి ఉందా అంటూ ఎలన్‌ మస్క్‌ ప్రశ్నించారు. ఆ తర్వాత వెంటనే ట్విట్టర్‌ లాంటి మరో ప్లాట్‌ఫామ్‌ అవసరమా అంటూ నెటిజన్లు కోరాడు. ఈ రెండు పోల్స్‌ నిర్వహించిన రెండు వారాల వ్యవధిలోనే ట్విట్టర్‌లో మేజర్‌ షేర్‌ హోల్డర్‌గా అవతరించాడు ఎలన్‌మస్క్‌.

ఎలన్‌ మస్క్‌ చేసే కామెంట్స్‌ పైకి సరదాగా అనిపించినా ప్రతీ చర్య వెనుక మాస్టర్‌ ప్లాన్‌ రెడీగా ఉంటుంది. అందువల్లే ట్విట్టర్‌లో ఎడిట్‌ ఫీచర్‌పై ఎలన్‌ మస్క్‌ పెట్టిన పోల్‌లో ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పరాగ్‌ అగ్రావాల్‌ యూజర్లను కోరారు. కాగా ఇప్పటికే ఎడిట్‌ బటన్‌పై ట్విట్టర్‌ వర్క్‌ చేస్తోంది. 

అయితే.. ఈ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో 3 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన 9.2 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేశారు. ఇందుకు ఆయన ఓపెన్ మార్కెట్ నుండి 7.35 కోట్ల ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల కోసం ఈ షేర్లు కొనుగోలు చేశారు. ఎలాన్ మస్క్ కొనుగోలు తర్వాత ట్విట్టర్ షేర్లకు డిమాండ్ పెరిగింది. సోమవారం మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్ 26 శాతం లాభాల్లో ట్రేడ్ అయింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సమస్యలు ఏర్పడుతున్నాయని ట్వీట్ చేసిన కొద్ది రోజులకే మస్క్ ట్విట్టర్ ఈక్విటీలో వాటా కొనుగోలు చేయడం గమనార్హం.