వండకుండానే వంట నూనె మంట పెడుతోంది.నూనె కొనాలి అంటేనే చుక్కలు చూపిస్తోంది. ఇక వంట నూనె సంగతి మరిచిపోవడం బెటర్ అనే రేంజ్ లో రేట్లు పెరుగుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. అటు దిగుమతులు తగ్గిపోవడం వల్ల వంట నూనెలకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో వంట నూనెల ధరలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయమై అనేక రాష్ట్రాల ప్రభుత్వాలతో కేంద్రం పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు సమాచారం. దీంతో పాటు వంట నూనెల ఎగుమతి, దిగుమతి దారులతో కేంద్రం చర్చలు జరిపిందని తెలుస్తోంది.
వంట నూనెల ధరల పెంపుపై చర్యలు
వంట నూనెల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ధరల పెరుగుదలతో రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలతో మంతనాలు జరిపి.. లాజిస్టిక్ మెషీన్లను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. గత వారం రోజుల్లో వంట నూనెల్లలో లీటరుకు రూ. 25 పెరిగింది. రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. 25 నుంచి 40 శాతంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే కారణమా..?
రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్, సోయాబీన్ ఆయిల్ సరఫరా కంటే మూడు రెట్లు ఎక్కువ డిమాండ్ పెరిగింది. వంటనూనెల వినియోగంపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశానికి ఇది పెద్ద సమస్యగా మారేందుకు అవకాశం ఉంది. దీంతో వంటనూనెల దిగుమతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాల ఏర్పాట్లను అన్వేషిస్తుంది. రానున్న రోజుల్లో వంటనూనెల ధరలు రూ. 170 నుంచి రూ. 180 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
