Asianet News TeluguAsianet News Telugu

నమ్మిన బంట్లతో గుల్లకంపెనీలు.. లండన్‌లో వివిధ ఖాతాలకు నిధుల మళ్లింపు.. ఇదే కింగ్ ఫిషర్స్ బాగోతం


పదేపదే భారతీయ బ్యాంకులు, విచారణాధికారులను, సంస్థలను ప్రశ్నిస్తున్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా.. తన నమ్మిన బంట్ల ద్వారా గుల్ల (షెల్) సంస్థలు ఏర్పాటు చేశారని వినికిడి. తీరా తనిఖీలు చేసే సమయానికే లండన్ నగరంలోని కింగ్ పిషర్స్ వైన్స్ యాజమాన్యం ఖాతాకు ఈ డొల్ల సంస్థల నుంచి నిధులు మళ్లుతున్నాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆ మేరకు దాడులు కూడా నిర్వహించింది. 

ED unearths new shell firms linked to Vijay Mallya; raids his close aide
Author
New Delhi, First Published Jul 30, 2019, 2:45 PM IST

న్యూఢిల్లీ: తాను అప్పులు చెల్లిస్తానన్న బ్యాంకులు పడనీయలేదని పదేపదే చెప్తున్న కింగ్ పిషర్స్ అధినేత విజయ్ మాల్యా బాగోతాలు బయట పడుతున్నాయి.  ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు రూ.9 వేల కోట్లకుపైగా రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన ఈ లిక్కర్ వ్యాపారి డమ్మీ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది.

షెల్ కంపెనీల సాయంతో తన సన్నిహితుడి ద్వారా మాల్యా అందుకున్న నిధులు, ఇతరత్రా అక్రమ లావాదేవీల గుట్టు రట్టు చేసే పనిలో ఇప్పుడు అధికారులు నిమగ్నం అయ్యారు. షెల్ కంపెనీల నేపథ్యంలో బ్యాంక్ మోసం దర్యాప్తు మరింత విస్తరించగా, పరారీ ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద గత వారం ఈడీ తొలిసారి తనిఖీలు నిర్వహించడం విశేషం. మోసపూరిత లావాదేవీల సమాచారం అందుకున్న ఈడీ.. బెంగళూరుకు చెందిన వీ శశికాంత్, ఆయన కుటుంబ సభ్యుల సంస్థలు, ఇతరత్రా వాటిపై దాడులు చేపట్టింది. 

మాల్యాకు శశికాంత్ నమ్మిన బంటు. 2017 ఫిబ్రవరిదాకా శశికాంత్ మాల్యా గ్రూప్ ఉద్యోగే. అంతేగాక దాదాపు తొమ్మిదేళ్లు మాల్యాకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్ (యూబీహెచ్‌ఎల్) ఎండీగా కూడా పనిచేశారు. కాగా, యునైటెడ్ బ్రాండింగ్ వరల్డ్‌వైడ్ (యూబీడబ్ల్యూ) పేరుతో శశికాంత్ ఓ సంస్థను ప్రారంభించారు. బెంగళూరులోని లావెల్లి రోడ్డులో నమోదైన ఈ సంస్థలో శశికాంత్ భార్య జయంతి, కూతురు అర్చిత కూడా భాగస్వాములే. 

ఈ యూబీడబ్ల్యూపై జరిగిన తనిఖీల్లో గోల్డ్ రీఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, మెక్‌డోవెల్ హోల్డింగ్స్ లిమిటెడ్ తదితర షెల్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు, మాల్యాతో వాట్సాప్ చాటింగ్‌లు, ఈ-మెయిల్స్‌ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్)లో యూబీహెచ్‌ఎల్‌కు 10.72 శాతం వాటా ఉన్నది. అధికారికంగా కింగ్‌ఫిషర్ బీర్లు, షూస్‌ను యూబీహెచ్‌ఎల్ ఎగుమతి చేస్తున్నది. 

యూబీహెచ్‌ఎల్ ఎగుమతులు యూబీడబ్ల్యూ ద్వారా జరుగుతుండగా, దీని వార్షిక టర్నోవర్ రూ.220 కోట్లుగా ఉన్నది. అయితే భారత్‌లోని సంపదను తన వద్దకు తెచ్చుకోవాలన్న లక్ష్యంతోనే యూబీడబ్ల్యూను సృష్టించారని, దీని ఆదాయం లండన్‌లోని మాల్యాకు తరలిపోతున్నదని ఈడీ అధికారులు అంటున్నారు. కాగా, యూబీడబ్ల్యూ ఎగుమతుల్లో 60 శాతం దుబాయ్‌కి చెందిన టమ్మి ఇంటర్నేషనల్‌కు జరుగుతున్నాయి. 

చాలా దేశాలకు ఈ సంస్థ ద్వారానే కింగ్‌ఫిషర్ బీర్లు చేరుతున్నాయి. అయితే శశికాంత్ కూతురు అర్చితకు టమ్మీ ఇంటర్నేషనల్‌లో మెజారిటీ వాటా ఉండటం గమనార్హం. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నది. 

యూబీ గ్రూప్‌లో ఇప్పటికీ 20-25 మంది ఉద్యోగులు మాల్యాకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నారని అంటున్న ఈడీ.. వారి ద్వారా లిక్కర్ కింగ్ మరెన్ని అక్రమ లావాదేవీలకు తెగబడ్డారా? అని ఆరా తీస్తున్నది. మరోవైపు భారత్‌లో తన ఆస్తుల జప్తును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో వేసిన మాల్యా పిటిషన్.. వచ్చే నెల 2న విచారణకు రానున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios