ముంబై/ న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ, ముంబైలోని ఆయనకు చెందిన దాదాపు 12 ఇళ్లు, కార్యాలయాల్లో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. 

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల విషయమై అదనపు సాక్ష్యాధారాల కోసం ఈ సోదాలు జరిపినట్టు అధికార వర్గాలు చెప్పాయి. 2012లో ఏర్పాటు చేసిన జెట్‌ ప్రివిలేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జేపీపీఎల్‌) కంపెనీ ఈక్విటీలో జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటాపైనా అధికారులు దృష్టి పెట్టినట్టు సమాచారం.

ఎతిహాద్‌ గ్రూపు కంపెనీ అయిన జేపీపీఎల్‌ ఈక్విటీలో మూతపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీకి 49.9 శాతం వాటా ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించి ఫెమా, ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా? అనే విషయం తెలుసుకునేందుకు ఈడీ అధికారులు ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ ఉన్నతాధికారులను ప్రశ్నించారు.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐఓ) అధికారులు గురువారమే ముంబైలో నరేశ్‌ గోయల్‌ను ప్రశ్నించారు. ఆ మరుసటి రోజే ఈడీ అధికారులు గోయల్‌కు చెందిన 12 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరపడం విశేషం.

తనపై జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసులతోపాటు తన విదేశీ ప్రయాణంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని నరేశ్ గోయల్‌ శుక్రవారం హైకోర్టును కోరారు. దీంతో ‘ఈ కేసు దర్యాప్తులో గోయల్‌ సహకరించడం లేదు’ అని హైకోర్టు జస్టిస్‌ నవీన్‌ చావ్లా దృష్టికి ప్రభుత్వ న్యాయవాది అజయ్‌ దిగ్బాల్‌ తీసుకెళ్లారు.

విదేశాలు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని నరేశ్‌ గోయల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది. పిటిషన్‌ను గోయల్‌ ఉపసంహరించుకోవడంతో కొట్టివేస్తున్నట్లు జస్టిస్‌ నవీన్‌ చావ్లా తెలిపారు. కేసులో ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తానని గోయల్‌ తాజాగా దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 17న విమాన సేవలు నిలిపివేసింది. మార్చిలో జెట్‌ ఛైర్మన్‌ పదవి నుంచి నరేశ్‌ గోయల్‌ వైదొలిగారు.