Asianet News TeluguAsianet News Telugu

3 నెలల్లోనే రూ.50 లక్షల కోట్ల నష్టం ! వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే..

కరోనా అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనుమానమేనని పలువురు ఆర్థికవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. గత మూడు నెలల్లోనే రూ.50 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Economists raise doubts over timing of economic revival in post-COVID-19 era
Author
Hyderabad, First Published Jun 20, 2020, 12:09 PM IST

కోల్‌కతా: భారత ఆర్థిక వ్యవస్థను కోవిడ్‌ మహమ్మారి కుదిపేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి మూడు నెలల్లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్ల మేర పడిపోనుందని ఎస్బీఐ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) నిర్వహించిన వెబినార్‌లో ఘోష్‌ మాట్లాడుతూ.. ఆర్థిక, ద్రవ్య రూపంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎన్ని సహాయ చర్యలు తీసుకున్నా ఈ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదన్నారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్నప్పుడే పులి మీద పుట్రలా కొవిడ్‌-19 మహమ్మారి విరుచుకు పడిందని ఘోష్‌ పేర్కొన్నారు. 

ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఇప్పటి వరకు ఆర్బీఐ అనువైన చర్యలే తీసుకుందన్నారు. మొండి బకాయిల (ఎన్‌పీఏ) భయం ఉన్నా, జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ స్థాయికి పడిపోతున్నపుడే రుణ వితరణ పెంచాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని ఘోష్‌ చెప్పారు.

కొవిడ్‌ తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందనే విషయం కూడా ఆర్థికవేత్తలకు అర్థం కావడం లేదు. వినియోగం, పెట్టుబడుల పతనం, ప్రభుత్వ ఖర్చులను మించిపోయిన విషయాన్ని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్పీ) డైరెక్టర్‌ రతిన్‌ రాయ్‌ గుర్తు చేశారు.

also read చైనా ఉత్పత్తులపై భారీగా మోగనున్న టాక్సుల మోత... ...

ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకుంటే తప్ప, ఈ పరిస్థితిలో మార్పు రాదన్నారు. కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలను నేరుగా ఆదుకునే బదులు ద్రవ్య పరపతి విధానాల ద్వారా ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ మొగ్గు చూపడాన్ని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్పీ) డైరెక్టర్‌ రతిన్‌ రాయ్‌ తప్పుపట్టారు. 

కొవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి తప్పదని ఈ వెబినార్‌లో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అన్నారు. ఈ అనిశ్చితి పోతే తప్ప పూర్తిగా డిమాండ్‌ తిరిగి పుంజుకునే అవకాశం లేదన్నారు.

కరోనా భయం పోయేంత వరకు ప్రజలు అత్యవసర ఖర్చులకు తప్ప, ఇతర ఖర్చులకు పోకుండా ఉన్న పొదుపు చేసేందుకే ఇష్టపడతారని సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ తక్కువన్న విమర్శలను సుబ్రమణియన్‌ తోసిపుచ్చారు. అమెరికా వంటి దేశాలూ తమ జీడీపీలో 3.5 శాతాన్ని ఉద్దీపనగా ప్రకటించి, మిగతా మొత్తాన్ని ద్రవ్య, పరపతి చర్యల ద్వారానే అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios